శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 23, 2020 , 02:34:27

శభాష్‌ శారద

శభాష్‌ శారద

  • డల్లాస్‌ వర్సిటీ నుంచి ఏఐలో ఉత్తీర్ణత పత్రం
  • టిటా సహకారంతో టెకీకి అంతర్జాతీయ శిక్షణ
  • ప్రత్యేకంగా అభినందించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అవును నిజమే.. ఈ శారద మీరు ఊహించిన టెకీనే. లాక్‌డౌన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోల్పోయి కూరగాయల వ్యాపారంచేస్తూ వార్తల్లో నిలిచిన యువతే. ఆపత్కాలంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) అండగా నిలువడంతో రూపాయి ఖర్చు లేకుండానే యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ ఎట్‌ డల్లాస్‌ నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో అంతర్జాతీయస్థాయి శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చేతులమీదుగా శారద వర్సిటీ ఉత్తీర్ణతపత్రాన్ని అందుకున్నారు.

లాక్‌డౌన్‌లో శారద ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి తెలుసుకున్న టిటా ప్రతినిధులు.. ఆమెకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ అందజేశారు. అమెరికా వర్సిటీలో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకొనేందుకు వీలుగా ఏర్పాట్లుచేశారు. కోర్సును శారద పూర్తిచేశారు. ఉద్యోగాలు కోల్పోతున్నవారు ఆందోళన చెందకుండా శారదను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఏఐ, బ్లాక్‌చెయిన్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి టెక్నాలజీలపై పట్టు సాధించాలని చెప్పారు. యువతలో నైపుణ్యాల కల్పనకు టిటా చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టిటా గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌కుమార్‌ మక్తాల పాల్గొన్నారు.