శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 09, 2020 , 02:01:00

చిన్నజిల్లాలు పెద్ద మేలు

చిన్నజిల్లాలు పెద్ద మేలు

  • కరోనాపై పోరుకు కలిసొచ్చిన జిల్లాల విభజన
  • క్షేత్రస్థాయిలోనే 33 మంది కలెక్టర్లు, ఎస్పీలు.. నిమిషాల్లో వైరస్‌ అనుమానితుల గుర్తింపు
  • లాక్‌డౌన్‌ అమలుపై ఎస్పీల నిరంతర పర్యవేక్షణలు.. ప్రతి చెక్‌పోస్టూ స్వయంగా తనిఖీ
  • కూలీల క్యాంపుల్లో కలెక్టర్ల ప్రత్యక్ష పరిశీలన.. ఆయుధంగా మారిన సమగ్ర కుటుంబ సర్వే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసిన చిన్న జిల్లాలు కరోనాపై పోరుకు ఎంతో కలిసొస్తున్నాయి. కరోనా అనుమానితులను క్షణాల్లో గుర్తించి.. నిమిషాల్లోనే క్వారంటైన్‌ చేయడానికి అవకాశం ఏర్పడుతున్నది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించారు. దీంతో 10 మంది కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో 33 మంది కలెక్టర్లు, ఎస్పీలు వచ్చారు. కొన్నిజిల్లాలను కలిపి పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పాటుచేసినచోట ఐపీఎస్‌ అధికారుల సంఖ్య కూడా పెరిగింది. దీంతో కేత్రస్థాయిలోనే పటిష్ఠమైన ప్రభుత్వ  యంత్రాంగం ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్‌ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఏగ్రామంలో ఎవరున్నారనే జాబితా సిద్ధంగా ఉండటంతో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వయంత్రాగం క్షణాల్లో అక్కడ వాలిపోతున్నది. ఇప్పుడు కొవిడ్‌-19 నుంచి యావత్‌ రాష్ర్టాన్ని కాపాడేందుకు ఇదే ప్రధాన ఆయుధమయింది.

అన్ని చెక్‌పోస్టులు తనిఖీ

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కోరలు గుర్తించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఏ ఒక్కరూ ఇంటినుంచి బయటకురావొద్దని సూచించారు. రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు, జిల్లాల సరిహద్దులు, జిల్లాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో చెక్‌పోస్టులు  ఏర్పాటుచేశారు. విభజన కారణంగా జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఒక్కో జిల్లాలో మూడు నుంచి నాలుగు చెక్‌పోస్టులు మాత్రమే ఏర్పాటుచేశారు.  దీంతో జిల్లా ఎస్పీ ప్రతిరోజూ ఆయా చెక్‌పోస్టులను స్వయంగా తనిఖీచేసి.. అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతున్నది. గతంలో జిల్లా విస్తీర్ణం పెద్దిదిగా ఉండటంతో ఎస్పీ అన్ని చెక్‌పోస్టులను కనీసం ఒక్కసారి కూడా పరిశీలించేందుకు వీలు కలుగకపోయేది. చిన్న జిల్లాలు కావడంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో, వాహనాల కట్టడిపై గట్టినిఘా పెట్టడంతో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతున్నది. 

త్వరగా నిత్యావసరాల పంపిణీ

లాక్‌డౌన్‌ కారణంగా ఇండ్లలో ఉంటున్న ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అందేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు.  తెల్ల రేషన్‌కార్డుదారులకు 15 కిలోల ఉచిత బియ్యంతోపాటు, 1500 నగదును అందజేశారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి కూలీలు, వలస కూలీలను గుర్తించి వారికి వసతి సౌకర్యంతోపాటు, సర్కారు అందజేసిన 12 కిలోల బియ్యం, నగదును స్వయంగా పంపిణీ చేశారు. రైతులు వ్యవసాయపనులు నిరాటంకంగా సాగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో కూలీలు, రేషన్‌ కార్డుదారులు తక్కువ సంఖ్యలో ఉండటంతో దీంతో కలెక్టర్లే స్వయంగా క్యాంపులకు వెళ్లి పరిశీలించి వారికి సహాయం చేయడానికి వీలు కలిగింది. జిల్లా కలెక్టర్లకు ఎస్పీ, ఇతర అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కో ఆర్డినేట్‌ చేసుకుని పనిచేసే అవకాశం చిన్నజిల్లాలతో ఏర్పడింది. జిల్లా, మండలస్థాయిలో ఏర్పాటుచేసిన కరోనా బృందాలకు మినిట్‌ టూ మినిట్‌ సమాచారం అందించి మాట్లాడి తగిన ఆదేశాలు ఇవ్వడం సులువైంది.

ఒక్కరాత్రిలో తబ్లిగీ కాంటాక్ట్‌ల గుర్తింపు

తెలంగాణ ఆవిర్భవించిన మొదట్లో సీఎం కేసీఆర్‌ జరిపించిన సమగ్ర కుటుంబసర్వే కరోనా అనుమానితుల గుర్తింపులో అధికారయంత్రాంగానికి ఎంతగానో ఉపయోగపడుతున్నది. సర్వే వివరాలన్నీ కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉండటంతో పని చాలా సులువవుతున్నది.  విదేశాల నుంచి వచ్చినవారు. ఢిల్లీలో తబ్లిగీ ప్రార్థనలకు వెళ్లివచ్చినవారితోపాటు, వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని విశ్లేషించి గుర్తించేందుకు ఈ జాబితా ఎంతో దోహదం చేసింది. రాష్ర్టానికి వచ్చిన సమాచారం జిల్లాలకు పంపించిన ఒక్క రాత్రిలోనే వారిని గుర్తించి క్వారంటైన్‌కు పంపి పరీక్షలు చేయించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా పెద్దజిల్లాలు అయితే ప్రభుత్వ సమాచారంమేరకు వెంటనే అందరినీ ట్రేస్‌చేయడం కష్టమయ్యేది. 33 మంది కలెక్టర్లు ఫాలోఅప్‌ చేయడంతో యంత్రాంగం వడివడిగా కార్యాచరణ చేపట్టింది.  ఉదాహరణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ మూడుజిల్లాలో కరోనా కేసులు 300 వరకు ఉన్నాయి. ఈ కేసులతోపాటు వాటి ట్రాకింగ్‌ అంతా మూడుజిల్లాల కలెక్టర్లు చూస్తున్నారు.  ఉమ్మడిగా ఉంటే ఒకే కలెక్టర్‌ చూడాల్సి వచ్చేది. కష్టమయ్యేది.

  • సూర్యాపేట జిల్లాలో తబ్లిగీకి వెళ్లొచ్చినవ్యక్తికి వైరస్‌ పాజిటివ్‌ రావడంతో అతడు ఎవరెవరితో కాంటాక్ట్‌లోకి వెళ్లాడో అధికారులు వెంటనే పరిశీలించారు. వర్థమానుకోటలో అతడి అత్తగారి కుటుంబంతో కలిసినట్టు తేలడంతో వెంటనే వారిని పరీక్షించగా అందులో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లామంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్‌ కలిసి గ్రామంలో పర్యటించి గ్రామాన్సి జల్లెడపట్టారు. ఆ కుటుంబం మాంసం విక్రయాలు చేస్తున్నదని తెలుసుకొని వారి దగ్గర మాంసం కొనుగోలు చేసిన వారిని గుర్తించేపనిలో పడ్డారు.
  • రిమ్స్‌లో పనిచేసే డాక్టర్‌ తబ్లిగీకి వెళ్లి మూడ్రోజులు అక్కడే ఉండి విషయం దాచిఉంచాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు కాల్‌ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా అతడు ఢిల్లీ వెళ్లివచ్చాడని నిర్ధారించుకుని క్వారంటైన్‌కు తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన రెండు జంటలు ఢిల్లీకి వెళ్లి రాగా, ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు, జోగు ళాంబ గద్వాల జిల్లాలో 19 మంది మర్కజ్‌కు వెళ్లొచ్చినట్టు అధికారులు గుర్తించారు. వారి తోపాటు వారు కాంటాక్ట్‌ అయిన వారి వివ రాలు సేకరించారు. ఎక్కడికక్కడ కాలనీలనే దిగ్బంధం చేశారు.

పదిహేను నిమిషాల్లో ఘటనా స్థలికి..

ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా అనుమానితులు 35 మంది ఉన్నట్టు తెలియడంతో సమాచారాన్ని సేకరించాం. 77మంది అనుమానితులను గుర్తించి క్వారంటైన్‌ చేశాం. జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉండటంతో మారుమూల గ్రామానికి కూడా గంట నుంచి రెండుగంటల్లో చేరుకొని సమస్యను పరిష్కరించడానికి వీలవుతున్నది. సమాచారం వచ్చిన 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ చేయగలుగుతున్నాం.

- దేవసేన, కలెక్టర్‌, ఆదిలాబాద్‌


logo