శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 29, 2020 , 12:59:01

స్థానిక సంస్థల ఎన్నికలని సోయిమరచిన పార్టీలు

స్థానిక సంస్థల ఎన్నికలని సోయిమరచిన పార్టీలు

హైదరాబాద్‌: గ్రేటర్‌లో జరుగుతున్నవి స్థానిక ఎన్నికలనే సోయిమరచి బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేని స్థితిలో బీజేపీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేవలం ఒక్క మతం వారినే ఓట్లు అడుగుతున్నట్లుగా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌కు ఏం చేశారనే విషయంలో కేంద్ర మంత్రులు ఒక్క ముక్కకూడా మాట్లాడలేదని చెప్పారు. ఇవి స్థానిక సంస్థల ఎన్నికలని గుర్తుచేశారు. ఆయన ఇవాళ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ మినీ ఇండియా అని, ఈ కాస్మోపాలిటన్‌ సిటీలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారని చెప్పారు.

కాలనీల నుంచి మోనో రైలు

గ్రేటర్‌లో ఏం చేయబోత్తున్నామనే విషయాలను మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో, భవిష్యత్‌లో ఏం చేయనుందో ప్రజలకు వివరించామన్నారు. నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింకురోడ్లు నిర్మించామని, నగరంలో పార్కులను కూడా అభివృద్ధిచేశామన్నారు. నాలాల నిర్వహణ కోసం ఒక సంస్థను ఏర్పాటు చేస్తామని, నాలాలను ఎలా తీర్చిదిద్దాలో కూడా మంత్రి కేటీఆర్‌ చెప్పారన్నారు. వరదల ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టబోతున్నామని వెల్లడించారు.  

మెట్రో రైలును ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తామని చెప్పారు. కాలనీల నుంచి మోనో రైలును కూడా తీసుకొచ్చే ఆలోచన ఉందన్నారు. జీహెచ్‌ఎంసీలో 20 వేల లీటర్లవరకు మంచినీటిని ఉచితంగా ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తుచేశారు. కృష్ణా, గోదావరి నీళ్లను అనుసంధానం చేసి హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా చేస్తామన్నారు. 2050 వరకు మంచినీటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 

క్యూ కడుతున్న కంపెనీలు

దేశంలో ఎక్కడాలేని విధంగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులకు అవకాశాలు కల్పించామని చెప్పారు. అందుకే అంతర్జాతీయ పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని వెల్లడించారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో విదేశీ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని, మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ చేప్పారని గుర్తుచేశారు. దేశంలోనే హైదరాబాద్‌ను మెరుగైన నగరమని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో హైదరాబాద్‌ ముందుందని చెప్పారు. దేశంలోని ప్రధాన నగరాలకు ప్రత్యేక నిధులిచ్చి అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరారని చెప్పారు. 


logo