గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 01:57:10

సంతాన యోగం!

సంతాన యోగం!
  • యోగాతో వీర్యకణాల వృద్ధి
  • సీసీఎంబీ, ఎయిమ్స్‌ సంయుక్త పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ తార్నాక: పిల్లలు పుట్టడం లేదని బాధపడుతున్నారా? మూడువారాల పాటు యోగా చేసి చూడండి. ఫలితం దక్కవచ్చు. పురుషుల్లో వీర్యకణాల వృద్ధికి యోగా తోడ్పడుతుందని హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) సంయుక్తంగా    నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడయ్యింది. సంతానోత్పత్తి కణాలు తక్కువగా ఉన్న   పురుషులతో 21 రోజులపాటు రోజుకు గంట చొప్పున సంప్రదాయ యోగావిధానంలోని ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించడం వల్ల వారిలో వీర్యకణాల నాణ్యత పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సంతానలేమితో బాధపడే పురుషులు ఆధునిక వైద్యవిధానంతోపాటు యోగా పద్ధతులు అనుసరించడం వల్ల ఫలితం ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. 


యోగా ప్రక్రియను అనుసరించినవారి వీర్యకణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి, వీర్యకణాల చురుకుదనంలో వేగం పెరిగింది. దీంతో వీర్యకణాలు ఫలదీకరణ సామర్థ్యాన్ని పెంపొందించుకొన్నట్టు నిర్ధారించారు. యోగా చేయడం వల్ల డీఎన్‌ఏ కదలికలను విశ్లేషించే మిథైలేషన్‌ అనే రసాయనిక మార్పు యథాస్థితికి చేరినట్టు గుర్తించారు.  వాతావరణ పరిస్థితులు, ఆహార అలవాట్లు, చెడు అలవాట్లు, క్రమపద్ధతిలేని జీవనవిధానం వల్ల జన్యుక్రమం విపరీతమార్పులకు లోనై, సంతానోత్పత్తి కణాలకు హాని కలుగుతుందని రాకేశ్‌మిశ్రా చెప్పారు. 


logo
>>>>>>