శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:22

15లోగా బుద్ధవనం

15లోగా బుద్ధవనం

  • నాగార్జునుడి బోధనలు విశ్వవ్యాప్తం చేస్తాం
  • పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బౌద్ధంలోని మహాయానం పుట్టిన గడ్డ నాగార్జునసాగర్‌ను ప్రపంచపటంలో నిలిపేలా రూ. 100 కోట్ల వ్యయంతో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈ నెల 15వ తేదీలోగా పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతిలోని తన చాంబర్‌లో నాగార్జునసాగర్‌లో నిర్మాణంలో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టును తీర్చిదిద్దాలని పర్యాటక, పురావస్తుశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బౌద్ధానికి ప్రతీకలైన ఫణిగిరి, ధూళికట్ట, బుద్ధవనం ప్రాంతాలను అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ నిధులు కేటాయించారని తెలిపారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో దొరికిన చారిత్రక అవశేషాలతోపాటు ఫణిగిరి, నాగార్జునసాగర్‌లో లభ్యమైన విగ్రహాలను అప్పగించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. ఇందుకోసం అవసరమైతే పురావస్తుశాఖ అధికారులను ఏపీకి పంపుతామని వెల్లడించారు. బుద్ధవనం ప్రాజెక్టులో పర్యావరణ హిత పర్యాటక రిసార్టులు, సాహస క్రీడలకు ఏర్పాట్లు, బోటింగ్‌ సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ఫుడ్‌కోర్టులు, పార్కింగ్‌, వసతి కల్పిస్తామని వెల్లడించారు. 

ఆర్కియాలజీ మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలో తాను బుద్ధవనం ప్రాజెక్టును మరోసారి సందర్శించి.. పూర్తి వివరాలతో సీఎం కేసీఆర్‌కు నివేదిక అందిస్తానని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్త కార్యదర్శి కే రమేశ్‌, పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్‌, తెలంగాణ ఆర్కియాలజీశాఖ అధికారులు నారాయణ, సుజాత తదితరులు పాల్గొన్నారు.