బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 01:35:30

జీవో 203ను అడ్డుకుంటాం

జీవో 203ను అడ్డుకుంటాం

  • రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి
  • మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడి

మహబూబ్‌నగర్‌, ప్రతినిధి: సాగునీటి వివక్ష కారణంగానే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందనీ, జల దోపిడికి సద్దులు మోసినవారు ఇవ్వాళ మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలతీరును వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ సర్కారు విడుదల చేసిన జీవోనెం 203పై.. మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు కట్టిన సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు, దివంగత పీ జనార్దన్‌రెడ్డి తప్పా ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులు, కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్‌ నాడు రాజీనామా చేసి ఒత్తిడి తెచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో తొలి ప్రాధాన్యంగా 12.50 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినట్లు నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర జల దోపిడి మీద కేసులు పెట్టని ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ కోసం కడుతున్న ప్రాజెక్టుల మీద కేసులు వేశారని విమర్శించారు. రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ స్నేహహస్తం అందించారనీ, కానీ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో జారీ చేసిందన్నారు. ఈ అంశంపై కేఆర్‌ఎంబీ, బచావత్‌ ట్రిబ్యునల్‌, అపెక్స్‌ కమిటీ, సుప్రీం కోర్టు.. అన్ని వేదికలపైనా పోరాటం చేస్తామన్నారు. జీవో 203పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఒకతీరుగా... తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరోతీరుగా మాట్లాడుతున్నారని.. బీజేపీ, కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. జీవో 203ను న్యాయపరంగా ఎదుర్కొని కొత్తగా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టులను అడ్డుకుంటామన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదన్నారు.


logo