శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 15:59:45

రైతుబంధు సమితి సభ్యులకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేఖ

రైతుబంధు సమితి సభ్యులకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌ : రైతుబంధు సమితి సభ్యులకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి లేఖ రాశారు. సమితి సభ్యులను ఉద్దేశించి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందన్నారు. రైతు సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవసాయ మార్కెట్లను మూసి వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం యాసంగి పంట దిగుబడి సమయం కాబట్టి వీలైన ప్రతి ఊరిలో ఐకేపీ సెంటర్ల ద్వారా, పీఏసీఎస్‌ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరించడం జరుగుతుందన్నారు. కావునా రైతుబంధు సమితి సభ్యులందరూ ఏ గ్రామంలో ఏ విభాగం(ఐకేపీ, పీఏసీఎస్‌, ఇతర సంస్థలు) వారు ధాన్యం సేకరిస్తున్నారో వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారుల ద్వారా తెలుసుకొని రైతులకు సరైన సమాచారం ఇచ్చి సహాయపడాల్సిందిగా కోరారు. 

పండిన పంటనంతా ప్రభుత్వం కొంటుందని ఈ విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులు, వ్యవసాయ పనులు చేసేవారు గుంపులుగా ఉండకుండా చూడాలన్నారు. వ్యవసాయ పనులు మినహా మిగతా పనులకు వెళ్లొదని సూచించారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వైద్యులకు గానీ, దగ్గరలోని అధికారులకు గానీ సమాచారం అందజేయాలన్నారు. మూడు వారాలు జాగ్రత్తగా ఉంటూ మన తోటి రైతులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులమంతా ఏకమవుదాం కరోనాని తరిమికొడదామని ఆయన పేర్కొన్నారు. 


logo