సోమవారం 18 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 01:11:57

‘ఎమ్మెల్సీ’ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు

‘ఎమ్మెల్సీ’ ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు

  • గెలుపే లక్ష్యంగా ‘గులాబీ’ వ్యూహం
  • నియోజకవర్గాల వారీగా సమావేశాలు
  • వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో ప్రచారం షురూ

హైదరాబాద్‌, జనవరి 7 (నమస్తే తెలంగాణ): త్వరలో ఎన్నికలు జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార దూకుడును కొనసాగిస్తున్నది. నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించటం, నోటిఫికేషన్‌ జారీ అయ్యేనాటికి గ్రామస్థాయి వరకు రెండు దఫాలుగా ప్రచారం నిర్వహించేలా ముందుకెళుతున్నది. ఇప్పటికే జిల్లాల వారీగా సమావేశాలు దాదాపు పూర్తిచేసింది. పట్టభద్రుల ఓటర్ల నమోదులో టీఆర్‌ఎస్‌ అనుసరించిన వ్యూహం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చే అవకాశాలు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటర్ల నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసిన మరుక్షణం నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు రంగంలోకి దిగి పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించారు. ఎన్నికలు జరుగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థా నాలను కైవసం చేసుకునేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకుసాగుతున్నది. సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరున్నరేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు వివిధ వర్గాలకు ప్రత్యేకించి ఉద్యోగులకు కల్పించిన అవకాశాలు, చేపట్టిన నియామకాలను, త్వరలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైన అంశాలను ప్రతి ఓటరుకు వివరించాలని నిర్ణయించింది. అందులోభాగంగా వరంగల్‌- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో గులాబీ శ్రేణులు ప్రచారంలోకి దిగాయి. ఈ పట్టభద్రుల స్థానం పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ శ్రేణుల సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రచారవ్యూహాన్ని రూపొందించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు సహా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ గెలుపుకోసం కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు.

వరంగల్‌లో ప్రచారం..

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల స్థానంలో ఎమ్మె ల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిసహా వరంగల్‌ జిల్లా నాయకులు గురువారం ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేయడంతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, పట్టభద్రులను ప్రత్యక్షంగా కలిశారు.