శనివారం 11 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:30

దసరా నాటికి రైతు వేదికలు

దసరా నాటికి రైతు వేదికలు

  • రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దసరా నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని, ఆ మేరకు పనులు చేపట్టినట్లు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. దసరా నాడు రైతువేదికల ప్రారంభోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటామన్నారు. సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో రైతు వేదికల నిర్మాణాలకు ఆయన భూమి పూజ చేశారు. అంతకుముందు వేలేరు మండలం షోడశపల్లి, మల్లికుదుర్ల, జానకీపురం చెరువులకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డుస్థాయిలో పూర్తిచేశారన్నారు. 

రైతుబంధు కింద 15 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నామని, వారం రోజు ల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందన్నారు. ప్రతి గ్రామంలో గోదాముల నిర్మాణం, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి కల్లాల నిర్మాణానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించినట్లుగా రైతులు నియంత్రితసాగు విధానంలోకి రావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, జెడ్పీ చైర్మన్‌ జీ సుధీర్‌కుమార్‌, అర్బన్‌ జిల్లా రైతు బంధు సమితి చైర్‌పర్సన్‌ ఎల్లావుల లలితాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.logo