బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 03:13:11

దాశరథి స్ఫూర్తి రాష్ర్టానికి దిక్సూచి

దాశరథి స్ఫూర్తి రాష్ర్టానికి దిక్సూచి

  • ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చిన కలంయోధుడు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మహాకవి దాశరథి స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసేలా మహాయజ్ఞం చేపట్టారని సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఇప్పటికే 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సదుపాయం కల్పించినట్టు తెలిపారు. బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన దాశరథి 96వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి .. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాకవి దాశరథి అని కీర్తించారు. జైల్లో పెట్టినా జైలు గోడల మీద కవిత్వాన్ని రాసి ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చిన కలంయోధుడన్నారు. నా తెలంగాణ కోటి రతనాలవీణ అని దాశరథి అన్న మాట.. ఉద్యమకాలంలో ప్రజలందరినీ ఉర్రూతలూగించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి కవులను గౌరవించుకుంటున్నామని, వారి జయంతి కార్యక్రమాలను అధికారికంగా భాషాసాంస్కృతికశాఖ ద్వారా నిర్వహిస్తున్నామని చెప్పారు. 2020 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారానికి ప్రముఖ కవి తిరునగరి రామానుజయ్యను ఎంపిక చేసినట్టు మంత్రి వెల్లడించారు. కాగా, దాశరథి జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులను మంత్రి సన్మానించారు.


logo