శనివారం 29 ఫిబ్రవరి 2020
నేడే ‘సహకార’ పోరు

నేడే ‘సహకార’ పోరు

Feb 15, 2020 , 02:33:39
PRINT
నేడే ‘సహకార’ పోరు
  • ఉదయం 7 నుంచి ఒంటిగంటవరకు పోలింగ్‌
  • మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్‌.. సాయంత్రం ఫలితాల వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్‌) ఎన్నికలకు సర్వంసిద్ధమైంది. శనివారం ఉదయం ఏడుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌.. మధ్యాహ్నం రెండుగంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 747 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలోని 6,248 డైరెక్టర్‌ పదవులకు ఎన్నిక జరుగనుండగా.. సుమారు 12 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు పోలింగ్‌కు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. 


శుక్రవారం మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందజేయగా.. సాయంత్రానికే తమకు కేటాయించిన కేంద్రాలకు వారు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో 747 మంది గెజిటెడ్‌ అధికారులు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తుండగా, మరో 20 వేల మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మధ్యా హ్నం ఒంటిగంటకు పోలింగ్‌ ముగిసిన అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్‌.. సాయం త్రం వరకు ఫలితాలను వెల్లడించనున్నారు. 


ఫలితాలు వెల్లడైన మూడురోజుల అనంతరం పాలకవర్గాల నియామకం చేపట్టనున్నట్టు రాష్ట్ర సహకారశాఖ ఎన్నికల అథారిటీ అధికారి సుమిత్ర వెల్లడించారు. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా కోరం లేకుంటే, మరుసటి రోజు అవకాశం ఉంటుందని, ఆ రోజు కూడా కోరం లేకుంటే.. సమావేశానికి హాజరైన సభ్యుల్లో మెజార్టీ ప్రకారం చైర్మన్‌ నియామకం జరుగుతుందని ఆమె తెలిపారు. కాగా, ఈ ఎన్నికలకు ప్రభుత్వం పటిష్ట భద్రత ఏర్పాట్లను చేపట్టింది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.  


logo