శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:36:28

కరోనాపై ఓజోన్‌ అస్త్రం

కరోనాపై ఓజోన్‌ అస్త్రం

  • వైరస్‌ సంహారానికి దేశంలోనే మొదటిసారి వినియోగం
  • యంత్రాన్ని అభివృద్ధిచేసిన నిమ్స్‌, డీఆర్డీవో శాస్త్రవేత్తలు
  • పరికరాన్ని ఆవిష్కరించిన హైదరాబాదీ సంస్థ స్టెర్లిట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మానవాళిని గడగడలాడిస్తున్న కరోనాను సంహరించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. అతి నీలలోహిత కిరణాలలోని ‘సీ’ రకం (యూవీ-సీ) కాంతి కొవిడ్‌-19ను సమర్థంగా సంహరిస్తుందని తెలిసిందే. మరి.. ‘కాంతి చేరలేని ప్రాంతంలో ఉన్న వైరస్‌ను చంపేదెలా?’ దీనికి పరిష్కారంగా ఓజోన్‌ వాయువును ఉపయోగించి వైరస్‌ను సంహరించే విధానాన్ని నిమ్స్‌కు చెందిన శాస్త్రవేత్త మధుమోహన్‌రావు, డీఆర్డీవో శాస్త్రవేత్త వీరబ్రహ్మం అభివృద్ధిచేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని ఆవిష్కరించడం విశేషం. స్టెర్లిట్‌ అనే సంస్థ ఈ టెక్నాలజీ ఆధారంగా ‘యూవీసీ మ్యాజిక్‌ వింగ్స్‌' పేరుతో యంత్రాన్ని తయారుచేసింది. ఇది సాధారణ యూవీసీ యంత్రాలకన్నా సమర్థంగా పనిచేస్తుందని, సురక్షితమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

పనితీరు ఇలా..

మూడు ఆక్సిజన్‌ పరమాణువులు కలిస్తే ఓజోన్‌ (O3) వాయువు ఏర్పడుతుంది. ఇది విషపూరితమైనది. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ యంత్రం పనిచేస్తుంది. ఇది గదిలో ఉండే ఆక్సిజన్‌ను రెండు ఆక్సిజన్‌ పరమాణువులుగా విడగొడుతుంది. అందులో ఒకటి ఆక్సిజన్‌ (O2) తో కలిసి ఓజోన్‌ (O3)గా మారుతుంది. ఆ గదిలో కాంతి చేరలేని ప్రాంతాలకు ఓజోన్‌ వెళ్లి సూక్ష్మజీవులన్నింటినీ సంహరిస్తుంది. మొత్తంగా 99.9 శాతం సూక్ష్మజీవులను సంహరిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

  • 30 నిమిషాల్లో 500 చదరపు అడుగుల వైశాల్యాన్ని సూక్ష్మజీవి రహితం చేయవచ్చు. గది పరిమాణాన్ని బట్టి యంత్రం సామర్థ్యాన్ని పెంచుకొనేలా, తగ్గించుకొనేలా ఏర్పాట్లు ఉన్నాయి. 
  • మ్యాన్యువల్‌గా, రిమోట్‌ కంట్రోల్‌తో ఆపరేట్‌ చేయవచ్చు. టైమర్‌ సదుపాయం కూడా ఉన్నది. 
  • సాధారణంగా యూవీసీ పరికరాలను ఆన్‌ చేసినప్పుడు ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లరాదు. ఒకవేళ అనుకోకుండా ఎవరైనా వచ్చినా ఆటోమెటిక్‌గా ఆగిపోయేలా ‘మ్యాజిక్‌ వింగ్స్‌'లో సెన్సార్లు ఉన్నాయి. యంత్రాన్ని ఆఫ్‌ చేసిన తర్వాత 10 నిమిషాలపాటు కిటికీలు తెరిచి ఉంచితే ఓజోన్‌ మొత్తం వాతావరణంలోకి వెళ్లిపోతుంది. 

ఓజోనైజర్‌ను వినియోగించింది మేమే

దేశంలో తొలిసారిగా యూవీ-సీ కాంతితోపాటు ఓజోనైజర్‌ను వినియోగించాం. గదిలోని బ్యాక్టీరియా, వైరస్‌, సూపర్‌ బగ్స్‌, ఇతర సూక్ష్మజీవులను సంహరిస్తుంది. ఈ యంత్రాన్ని దవాఖానలు, దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, థియేటర్లు, బస్సులు, విమానాలు వంటివాటిలో వినియోగించవచ్చు.

- మధుమోహన్‌రావు, నిమ్స్‌ శాస్త్రవేత్తlogo