సోమవారం 25 మే 2020
Telangana - Feb 24, 2020 , 13:30:34

భవిష్యత్‌ తరాలకు ఆక్సిజనే అసలైన ఆస్తి

భవిష్యత్‌ తరాలకు ఆక్సిజనే అసలైన ఆస్తి

సూర్యాపేట : సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని రెండో వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రారంభించారు. వార్డును మొత్తం కలియతిరిగిన మంత్రి జగదీష్‌ రెడ్డి.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. భవిష్యత్‌ తరాలకు ఆక్సిజనే అసలైన ఆస్తి.. దాన్నే మనం అందివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని మన ఇంటి నుంచే ప్రతి ఒక్కరూ మొదలుపెట్టాలని విజ్ఞప్తి చేశారు మంత్రి. యావత్‌ ప్రపంచాన్ని కాలుష్యం బెంబేలెత్తిస్తుందన్న మంత్రి.. మానవాళి మనుగడకు పర్యావరణ కాలుష్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అకాల జబ్బులకు పర్యావరణ సమస్యలే కారణమని మంత్రి జగదీష్‌ రెడ్డి చెప్పారు. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కొరతను అధిగమించాలంటే చెట్లు పెంచడమే అందుకు పరిష్కారమని జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన మహోత్తర కార్యక్రమం హరితహారం అందులో భాగమేనని మంత్రి తెలిపారు. అడవుల పెంపకంతో మానవాళిని కాపాడుకోవచ్చు అన్నది సీఎం కేసీఆర్‌ సంకల్పమని మంత్రి ఉద్ఘాటించారు. పర్యావరణ సమస్యకు చెక్‌ పెట్టేలా పట్టణ ప్రగతిలో విరివిగా చెట్లను నాటి పెంచాలన్నారు. పట్టణ ప్రగతిలో మొదటి ప్రాధాన్యత చెట్లను నాటడం, పెంచడానికి ఇవ్వాలన్నారు. రెండో ప్రాధాన్యత అంశంగా పారిశుద్ధ్యంను తీసుకోవాలని మంత్రి సూచించారు. మూడో ప్రాధాన్యత అంశంగా స్మశాన వాటికల నిర్వహణను తీసుకోవాలన్నారు మంత్రి జగదీష్‌ రెడ్డి. 


logo