సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:20:21

ఆక్సిజన్‌ కొనేస్తున్నారు!

ఆక్సిజన్‌ కొనేస్తున్నారు!

  • మరీ ఇంత భయమా?
  • కరోనా భయంతో కొందరి అతిజాగ్రత్త
  • ఆక్సిజన్‌ సిలిండర్లు, రెస్పిరేటర్లు నిల్వ
  • వదంతులు నమ్మవద్దంటున్న వైద్యులు
  • ఆక్సిజన్‌ అక్కెరలేకుండా 90% రికవరీ

‘రానురాను కరోనా రోగుల సంఖ్య పెరిగి ఆక్సిజన్‌ సిలిండర్లు దొరుకుడు కష్టమట కదా? అందుకే ఒకటి రెండు సిలిండర్లు తెచ్చి ఇంట్ల పెట్టుకోవాలనుకుంటున్న’.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి మాటలివి.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా భయంతో ప్రైవేటు దవాఖానాల్లో ముందే బెడ్లు రిజర్వు చేసుకుంటున్న వారు కొందరైతే, ఏకంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ కొని ఇంట్లో దాచిపెట్టుకుందామనుకుంటున్నవారు మరికొందరు. నిజానికి కరోనా బాధితుల్లో 90% మందికిపైగా ఆక్సిజన్‌ అవసరం లేకుండానే ప్రాథమిక చికిత్సతో కోలుకుంటున్నారని ప్రభుత్వం, వైద్యులు రోజూ చెప్తూనే ఉన్నారు. శ్వాస సంబంధ వ్యాధులు, వృద్ధాప్యం, వైరల్‌ లోడ్‌ అధికంగా ఉండటం.. ఇలాంటి సమస్యలున్నవారికే ఆక్సిజన్‌ అవసరమని నివేదికలు, సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. హైదరాబాద్‌ గాంధీ దవాఖానలో 700 మందికిపైగా బాధితులు చికిత్స పొం దుతుంటే.. ఆరుగురే వెంటిలేటర్‌పై ఉన్నా రు. అంటే ఒక్కశాతం కన్నా తక్కువ. అయి నా కొందరు అతిగా ఊహించుకొని హంగా మా సృష్టిస్తున్నారు. అనవసరంగా ఆక్సిజన్‌ సిలిండర్లకు డిమాండ్‌ పెంచుతున్నారు. 

ఇంట్లోనూ సిలిండర్‌ వద్దు

కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి ఇంటివద్దే ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్‌ గతంలోనే స్పష్టంచేసింది. వైద్యసిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లడం లేదా టెలిమెడిసిన్‌ ద్వారా వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇలాంటివారిలో 90 శాతానికిపైగా త్వరగా కోలుకుంటున్నారు. మిగతావారిలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి, వైద్యుల పర్యవేక్షణలోనే కృత్రిమ శ్వాస అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అపోహలు వద్దు

కరోనా సోకినా ప్రతివారికీ కృత్రిమ శ్వాస అవసరం ఉండదు. పైగా మన వద్ద ఆక్సిజన్‌ కొరతలేదు. అపోహలు పెట్టుకోవద్దు. కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఆక్సిజన్‌ సిలిండర్లు, రెస్పిరేటర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు ముందస్తుగా కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఇది సరికాదు. 

- డాక్టర్‌ సతీశ్‌రెడ్డి పుల్లల్రేవు, సీనియర్‌ లాప్రోస్కోపిక్‌ సర్జన్‌, కాంటినెంటల్‌ ,హాస్పిటల్‌, గచ్చిబౌలి


logo