గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 10:23:52

దేశంలో ఎక్కడాలేని విధంగా ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్స్‌ : మంత్రి కొప్పుల

దేశంలో ఎక్కడాలేని విధంగా ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్స్‌ : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ : బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశాలకు అధ్యక్షత వహించారు. సభలో ప్రస్తుతం ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్స్‌పై సభ్యులు షకీల్‌, ఆనంద్‌ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమాధానమిస్తూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఐదు దేశాలకు(అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌) మాత్రమే ఈ పథకం వర్తించేదన్నారు. కాగా ఇప్పుడు పది దేశాలకు విస్తరించడం జరిగిందన్నారు. అదనంగా ఇప్పుడు ఫ్రాన్స్‌, జర్మనీ, సౌత్‌కొరియా, జపాన్‌, న్యూజిలాండ్‌కు విస్తరించడం జరిగిందన్నారు. ఇందులో మహిళలకు కూడా రిజర్వేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. 2015లో 221 మంది విద్యార్థులు, 2016లో 358 మంది, 2017లో 350 మంది, 2018లో 333 మంది, 2019లో 250 మంది మొత్తంగా 1685 మంది విద్యార్థులు అ పథకం ద్వారా లబ్దిపొందారన్నారు. ఈ పథకం మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం 230 కోట్ల 40 లక్షల రూపాయలు అన్నారు. ప్రస్తుత బడ్జెట్‌లో 42 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. పథకంలో సంవత్సరానికి ఉన్న 500 కోటా నిండటం లేదు కావునా కోటాను పెంచే ఆలోచన లేదని మంత్రి పేర్కొన్నారు. 


logo