శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 00:39:15

ఓటమి భయంతోనే ఓవరాక్షన్‌

ఓటమి భయంతోనే ఓవరాక్షన్‌

  • కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో బీజేపీ ప్రచారం
  • టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక ఆపసోపాలు 
  • సార్వత్రిక ఎన్నికలకంటే ఎక్కువ హడావుడి
  • కాషాయ పార్టీని చూసి నవ్వుతున్న హైదరాబాదీలు 
  • వరదలా వస్తున్నారు కానీ వరదసాయమేదని నిలదీత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జరుగుతున్నవి స్థానిక సంస్థల ఎన్నికలు.. కానీ ఎన్నికల ప్రచారానికి మాత్రం కేంద్ర మంత్రులొస్తున్నారు.. పెద్దపెద్ద రాష్ర్టాల ముఖ్యమంత్రులొస్తున్నారు.. పార్టీ జాతీయ నేతలూ క్యూ కడుతున్నారు. ఏకంగా ప్రధామంత్రి కూడా ప్రచారానికి వస్తారని వార్తలు వస్తున్నాయి.. ఇదీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి. టీఆర్‌ఎస్‌కు హైదరాబాద్‌ ఓటర్లు బ్రహ్మరథం పడుతుండటంతో బెంబేలెత్తిపోతున్న కాషాయ పార్టీ.. ఏకంగా జాతీయ నాయకత్వాన్ని మొత్తం దింపుతున్నది. రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు గుర్తించే ఒక్క ముఖమూ లేకపోవటంతో దేశ నలుమూలల నుంచి నేతలు వచ్చి హడావిడి చేస్తున్నారు. బీజేపీ అతి చూస్తుంటే ఇవి జీహెచ్‌ఎంసీ ఎన్నికలా..! సార్వత్రిక ఎన్నికలా ! అన్నట్టుగా ఉన్నదని హైదరాబాదీలు ముక్కున వేలేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక గల్లీ ఎన్నికలకు ఢిల్లీ పెద్దలు వస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. వచ్చినవారు కేంద్రం నుంచి హైదరాబాద్‌ అభివృద్ధికి నిధులు కూడా పట్టుకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

భయంతో బెంబేలు

సాధారణంగా ఎవరైనా తీవ్రమైన భయానికి లోనైనప్పుడు పక్కవారు అదురుకొనేలా గట్టిగా అరుస్తారు. బల్దియా ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అలాగే ఉన్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేక భయంతో వణుకుతున్నది. అందుకే జాతీయ నేతలను రప్పించి విద్వేష ప్రచారం చేయిస్తున్నది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడటంలేదు. ఎంతసేపూ ప్రజలను రెచ్చగొట్టి మతం పేరుతో సమాజాన్ని విడదీసే కుట్రలే చేస్తున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, స్మృతి ఇరానీ, యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ప్రచారం చేశారు. రేపో మాపో పార్టీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి అదిత్యనాథ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌ రానున్నారు. ప్రధాని కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఓటర్లు బీజేపీని ఏ ఎన్నికల్లోనూ కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. కొన్నిచోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గెలిచినా స్థానిక అంశాల ప్రభావంతోనే తప్ప పార్టీని చూసి ఓట్లేసిన దాఖలాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ట్రంలో నాయకత్వమే లేని ఆ పార్టీని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో మేయర్‌ పీఠం దేవుడెరుగు.. కనీసం ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు కార్పొరేటర్లు గెలిచినా గొప్పేనని ఇటీవలే ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ఎన్నికల సర్వేలో తేలింది. ఈ విషయం అర్థమయ్యే కనీసం కేంద్ర నాయకులనైనా చూసి నాలుగు ఓట్లేస్తారేమోనని కమలం పార్టీ ఆశపడుతున్నది.  

ఢిల్లీలో ప్లాన్‌.. హైదరాబాద్‌లో అమలు 

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ ఢిల్లీ నాయకులను దించడం వెనుక భారీ కుట్ర ఉన్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌ మతంపరంగా సున్నిత ప్రాంతం. అయినా ఆరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ఒక్క దుర్ఘటన లేకుండా అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. రాజకీయ స్వార్థంకోసం ఈ ప్రశాంతతను దెబ్బతీసేందుకు బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే నడుస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ బీజేపీ పెద్దల ప్రణాళికలో భాగంగానే పాతబస్తీపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించినట్టు తెలుస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలుచేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లో ప్రచారానికి వస్తున్న, వచ్చిన బీజేపీ నేతలంతా గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టినవారే కావటం విశేషం. 

నేడు నగరానికి ఫడ్నవిస్‌ 

బీజేపీ తరఫున జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చే సేందుకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ గురువారం హైదరాబాద్‌ రానున్నారు. బేగంపేటలో బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. అదే విధంగా ఈనెల 27న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, 28న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, 29న అమిత్‌షా.. నగరంలోని వివిధ ప్రాంతా ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.   

రాష్ట్ర నేతలు..ఉప్పు నిప్పు

బీజేపీ రాష్ట్ర నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. నేతలు ఎవరికి వారే..యమునా తీరే అన్న చందంగా తయారవటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బుధవారం కొందరు రాష్ట్ర నేతలకు ఫోన్‌చేసినట్టు తెలిసింది. పార్టీలో విభేదాలు లేవని చెప్పేందుకు తక్షణమే ప్రచారం నిలిపివేసి.. అందరూ కలిసి మీడియా సమావేశం పెట్టాలని ఆదేశించినట్టు సమాచారం. దాంతో మల్కాజిగిరిలో ప్రచారంలో ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సనత్‌నగర్‌లో ప్రచారంలో ఉన్న బండి సంజయ్‌, కూకట్‌పల్లిలో ఉన్న లక్ష్మణ్‌ హుటాహుటిన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని విలేకరుల సమావేశం పెట్టి జాతీయ నాయకుల షెడ్యూల్‌ను ప్రకటించారు.logo