సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 02:30:33

హరితయజ్ఞం

హరితయజ్ఞం

  • ఊరూవాడా మొక్కల పండుగ
  • పెద్దఎత్తున ప్రజల భాగస్వామ్యం 
  • సిరిసిల్లలో ఒకే రోజు లక్ష మొక్కలు   
  • హరితహారానికి మంత్రులు, ప్రజాప్రతినిధుల హాజరు  
  • ఉద్యమంలా చేపట్టాలని పిలుపు

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూవాడా పండుగలా జరుగుతున్నది. నేడు మనం నాటిన మొక్క భావితరాల బంగారు భవిష్యత్‌కు బాట వేస్తుందన్న మాటతో ప్రజలు హరితహారంలో పెద్దఎత్తున భాగస్వాములు అవుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని మానేరు తీరాన శుక్రవారం ఒక్కరోజే లక్ష మొక్కలు నాటగా.. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మొక్కలు నాటుతూ ప్రజల్లో స్ఫూర్తినింపుతున్నారు. 

- నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌

హరితహారంలో భాగస్వాములవుదాం ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌  

రాజన్న సిరిసిల్ల,నమస్తే తెలంగాణ: భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతుందన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరిత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలనిమున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూరు మానేరు ఒడ్డున మెగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర పోతిరెడ్డిపల్లి రిజర్వు ఫారెస్టు బ్లాక్‌లో 200 ఎకరాల్లో అర్బన్‌ అటవీ పార్క్‌కు శంకుస్థాపనచేశారు. అనంతరం పదిరలో వ్యవసాయ కల్లాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని కేంద్రమే ప్రశంసించిందన్నారు.భవిష్యత్‌ తరాల కోసమే హరితహారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సీఎం పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 95 చోట్ల అర్బన్‌ ఫారెస్టు పార్కుల పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. సిరిసిల్లలో ఏర్పాటుచేస్తున్న అర్బన్‌ ఫారెస్టు 96వదని పేర్కొన్నారు. పదిర పరిధిలో విస్తరించి ఉన్న 581 హెక్టార్ల పోతిరెడ్డిపల్లి రిజర్వు ఫారెస్టులో 200 హెక్టార్లను అర్బన్‌ పార్క్‌ బ్లాక్‌ అభివృద్ధికి తీసుకున్నట్లు తెలిపారు. ఐదు విడుతల్లో రాష్ట్రవ్యాప్తంగా 182 కోట్ల మొక్కలను నాటినట్లు చెప్పా రు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాత్రమే కృషి చేస్తే సరిపోదని, ప్రజలు కూడాభాగస్వాములైతేనే హరితహారం విజయవంతం అవుతుందన్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తాగునీరు కొనుక్కుంటారని రాసినప్పుడు అందరూ నవ్వారని, కానీ ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చిందన్నారు. ఇష్టారీతిన చెట్లను నరికితే భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుందని, అలాంటి పరిస్థితి రావద్దని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారాన్ని చేపట్టిందన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

కాళేశ్వరంలో సస్యశ్యామలం: పోచారం


కాళేశ్వరం ప్రాజెక్టుతో సిరిసిల్ల జిల్లా సస్యశ్యామలం కానున్నదని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మానవాళి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం విజయవంతం చేయాలని కోరారు. జెడ్పీచైర్‌పర్సన్‌ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, పీసీసీఎఫ్‌ శోభ తదితరులు పాల్గొన్నారు.



logo