ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 07:43:16

మిగతా క్యాన్సర్లకంటే భిన్నమైన వ్యాధి...

మిగతా క్యాన్సర్లకంటే భిన్నమైన వ్యాధి...

హైదరాబాద్‌ : అండాశయ క్యాన్సర్‌ మహిళల్లో ప్రసూతి మరణాలకు ప్రధాన కారణంగా మారుతున్న మహమ్మారి. ఇది స్త్రీలలో సాధారణంగా వచ్చే రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ తదితర క్యాన్సర్ల కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నట్లు క్యాన్సర్‌ వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంవత్సరం సుమారు 2.5లక్షల మంది ఓవరీస్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. ఇక మన దేశంలో సుమారు 45వేల నుంచి 50వేల మందిపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుండగా, రాష్ట్రంలో మాత్రం సుమారు 10వేల  మంది మహిళలు ప్రతి సంవత్సరం ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 2019లో ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖానలో అండాశయ క్యాన్సర్‌కు సంబంధించి సుమారు 400కేసులు నమోదైనట్లు ఎంఎన్‌జే వర్గాలు తెలిపాయి. మొత్తం బాధితుల్లో  60శాతం మరణాలు కేవలం అండాశయ క్యాన్సర్‌ వల్లే సంభవిస్తున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.అయితే ఇతర క్యాన్సర్‌ వ్యాధుల్లా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం అంత సుల భం కాదంటున్నారు వైద్యనిపుణులు. ప్రారంభ దశలో గుర్తించడం కష్టమేనంటున్నారు.  

క్యాన్సర్‌ రెండు రకాలు

వంశపారపర్యంగా బాధితులను రెండు రకాలుగా విభజించారు. అందులో మొదటిది బ్రాకా-1, రెండోది బ్రాకా-2. ఈ రెండు రకాల పాజిటివ్‌ బాధితుల్లో 90-95శాతం మందికి అండాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశమున్నట్లు ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖాన వైద్యనిపుణులు డా.సాయిరాం తెలిపారు. వ్యాధి నిర్ధారణలో ముందుగా బ్రాకా-1, బ్రాకా-2 పరీక్షలు నిర్వహిస్తారని ఈ పరీక్షల్లో ఏరకం పాజిటివ్‌ వచ్చినా వారికి అండాశయ క్యాన్సర్‌ వ్యాధిని సస్పెక్ట్‌ చేయవచ్చని ఆయన తెలిపారు. 

రసాయనాలతో కూడిన పౌడర్లే ప్రధాన కారణం 

హానికరమైన రసాయనాలతో కూడిన కొన్ని రకాల పౌడర్లతో ఈ క్యాన్సర్‌ వ్యాధి సోకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందులో ముఖ్యంగా ఆస్‌బెస్టాస్‌ కలిగిన పౌడర్లను వినియోగించడంతో మహిళలకు ఈ అండాశయ క్యాన్సర్‌ వస్తుందని దీంతో పాటు హార్మోన్‌ ఇన్‌బ్యాలెన్స్‌, ఆల్కహాల్‌, పొగాకు ఉత్పతులను వాడడంతో కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశమున్నట్లు డా.సాయిరామ్‌ తెలిపారు.

 వ్యాధి లక్షణాలు: 

*  కడుపులో నొప్పి

*  ఆకలి మందగించడం

*  కాళ్లలో వాపు

*  కడుపులో మంట

*  అజీర్తి

*  కడుపు ఉబ్బడం

*  ఎసిడిటీ

వ్యాధి నిర్ధారణ పరీక్షలు

*  అల్ట్రాసౌండ్‌

*  సీఎ125(ట్యూమర్‌ మార్కర్‌ బ్లడ్‌టెస్ట్‌)

*  ఎంఆర్‌ఐ

-బ్రాకా1, బ్రాకా2 పరీక్షలు   

50 ఏండ్ల పైబడిన వారికే అధికం 

సాధారణంగా 50సంవత్సరాలు నిండిన వారిలోనే ఈ వ్యాధి అధికంగా కనిపిస్తుందని వైద్యనిపుణులు తెలిపారు. ఈ వ్యాధికి కారణాలు చాలా ఉన్నప్పటికీ కొన్నింటిని ప్రత్యేక కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఇతర క్యాన్సర్‌ల్లానే ఇది కూడా వంశపారపర్యంగా కొంత మందికి వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. logo