మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 03:20:48

సంక్షేమ బండికి అప్పులే ఇంధనం!

సంక్షేమ బండికి అప్పులే ఇంధనం!

  • రాష్ర్టాల అప్పులు రూ.55 లక్షల కోట్లకు  
  • ఈ ఏడాది కొత్తగా రూ.8.25 లక్షల కోట్లు 
  • అప్పులు చేయడంలో అట్టడుగున తెలంగాణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా దెబ్బకు అన్ని రాష్ర్టాల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. లాక్‌డౌన్‌తో ఆదాయం పూర్తిగా పడిపోగా.. ఆంక్షలు సడలించినా ఇం కా మునుపటి సాధారణ స్థితి నెలకొనలేదు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలుకు అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది. గత ఏడాది చివరినాటికే అన్ని రాష్ర్టాల అప్పులు రూ.47 లక్షల కోట్లుగా ఉన్నది. జీడీపీలో ఇది 24.8%. బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లోని రాష్ర్టాల అప్పుల కన్నా ఇది చాలా ఎక్కువ. ఈ ఏడాది మరో రూ.6.05 లక్షల కోట్లు అప్పుల భారం పెరుగవచ్చని మొదట్లో అంచనావేశారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ర్టాలు మరో రూ.2 లక్షల కోట్లు అదనంగా రుణాలు తీసుకుంటాయని, మొత్తంగా ఈ ఏడాది రూ.8.25 లక్షల కోట్ల మేర అప్పు చేయాల్సి వస్తుందని ‘ఇండియా రేటింగ్స్‌' సంస్థ అంచనా వేసింది. ఇది జీడీపీలో 24.9 శాతంగా ఉండవచ్చని తెలిపింది. అయితే తెలంగాణ మాత్రం అప్పులు చేయడంలో పొదుపు పాటిస్తున్నది. దేశంలోని పెద్ద రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణ కింది నుంచి రెండోస్థానంలో ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో హద్దు మీరలేదనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం.

అప్పు.. తప్పుపట్టొద్దు 

రాష్ర్టాలకు వచ్చే ఆదాయంలో కేంద్రం వివిధ రూపాల్లో అందించే నిధులు 43% వరకు ఉంటాయి. మిగతావి రాష్ర్టాలు సొంతంగా రెవెన్యూ, పన్నులు, ఎక్సైజ్‌ తదితర రూపాల్లో రాబట్టుకోవాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ కాలంలో రాష్ర్టాల ఆదాయం 90% వరకు పడిపోయింది. దేశంలోని 21 పెద్ద రాష్ర్టాలు ఒక్క ఏప్రిల్‌లోనే రూ.97వేల కోట్ల ఆదాయం కోల్పోయాయి. ఆంక్షలు సడలించినా మునుపటి స్థితి రాలేదు. దీంతో అధిక అప్పుచేయక తప్పేట్టులేదు.  

తెలంగాణ అప్పులు 2.3 శాతమే 

తెలంగాణలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అప్పులు చేసిం ది. అయితే ఎక్కడా హద్దు దాటలేదు. మన ఆదాయం ఎంత? ఎంత భారం మోయగలం? తెచ్చే అప్పుతో ఎంత సంపద సృష్టించగలం? వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రుణాలు తీసుకొచ్చింది. వాటిని సంపద సృష్టికి వెచ్చించింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ‘ఇండియా రేటింగ్స్‌' సంస్థ నివేదిక చెంపపెట్టులాంటిది. దేశంలోని 15 పెద్ద రాష్ర్టాల్లో జీడీపీతో అప్పు ల మొత్తాన్ని పోల్చినప్పుడు తెలంగాణ అట్టడుగున నిలిచింది. గుజరాత్‌ తర్వాత తక్కువ అప్పులున్న రాష్ట్రంగా అవతరించింది. ‘ఇండియా రేటింగ్స్‌' ప్రకారం రాష్ట్ర అప్పులు జీడీపీతో పోల్చితే 2.3% మాత్రమే. మనకన్నా గుజరాత్‌ మాత్రమే (1.6%) దిగువన ఉన్నది. బీహార్‌ ఏకంగా 9.5% అప్పులతో అగ్రస్థానంలో నిలిచింది.logo