మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 01:34:32

మనది అంతర్జాతీయ సోనా

మనది అంతర్జాతీయ సోనా

  • పల్లి, పత్తి, కంది కూడా నాణ్యమైనవే
  • రైతు ఉత్పత్తులకు ప్రచారం మంత్రి నిరంజన్‌రెడ్డి
  • హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో పండే పంటలకున్న నాణ్యత, వాటి గొప్పతనం దృష్ట్యా ఆ ఉత్పత్తులను అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లాలన్నదే రాష్ట్ర ప్రభు త్వ ఉద్దేశమని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంత్రుల నివాస సముదాయంలోని తన ఇంట్లో మంత్రి.. మంగళవారం రాష్ట్రంలోని పంట ఉత్పత్తులపై అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సోనా మార్కెటింగ్‌ వ్యూహంపై ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ రూపొందించిన నివేదికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రైతు ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, రైతుల కష్టానికి తగిన ఫలితం దక్కే లా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పంజాబ్‌ ప్రభుత్వం 25 ఏళ్ల క్రితమే బాసుమతి బియ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు. తెలంగాణ సోనా గతంలో 4 లక్షల ఎకరాలలో సాగు చేయగా, ఈ ఏడాది 10 లక్షల ఎకరాలకు పెరుగడమే దీనికి లభిస్తున్న ఆదరణకు నిదర్శనం అని పేర్కొన్నారు.  గతంలో పాలమూరు (వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగుళాంబ గద్వాల) జిల్లాలో యాసంగిలో పండే వేరుశనగ (పల్లి) అప్లటాక్సిన్‌ అనే శిలీంధ్రం (ఫంగస్‌) లేని పంట అని, దీనికి జాతీయ, అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉందని తెలిపా రు. తెలంగాణ పత్తి దేశంలోనే ఎంతో నాణ్యమైదని, సీసీఐ సీఎండీ మన పత్తిపై ప్రశంసలు కురిపించారని గుర్తుచేశారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సహకారశాఖ కమిషనర్‌ వీరబ్రహ్మయ్య, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ప్రవీణ్‌రావు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రతినిధులు ప్రొఫెసర్‌ శేషాద్రి, ప్రొఫెసర్‌ మధు విశ్వనాథన్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు.


logo