e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 18, 2021
Advertisement
Home తెలంగాణ మన గెలుపే బీజేపీకి జవాబు

మన గెలుపే బీజేపీకి జవాబు

  • లేకుంటే సింగరేణిని అమ్మేసే ప్రమాదం 
  • ఐటీఐఆర్‌, బయ్యారం ఉక్కు, కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదు
  • పట్టభద్రులు ధోకా పార్టీకి బుద్ధి చెప్పాలి 
  • బీజేపీ, కాంగ్రెస్‌ అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి
  • పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు పిలుపు

హైదరాబాద్‌, మార్చి 5 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశం పట్ల చిన్నచూపు చూసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన జవాబు చెప్పాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు పట్టభద్రులైన ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 16 ఐఐటీ, 10 ఎన్‌ఐటీ, 85 నవోదయా లు మంజూరైనా తెలంగాణకు రిక్తహస్తం చూపిన కేంద్రానికి సరైన తీర్పుని ఇవ్వాలని కోరారు. ఇప్పటికే అన్నింటినీ ప్రైవేట్‌పరం చేస్తున్న కేంద్రం రాబోయే రోజుల్లో మన సింగరేణిని సైతం ప్రైవేట్‌కు అప్పగించే దుస్సాహసానికి ఒడిగడుతుందని మంత్రి కేటీఆర్‌ దుయ్యబట్టారు. ఐటీఐఆర్‌, బయ్యారం ఉక్కు నుంచి నేటి రైల్వే వ్యాగన్‌ ఫ్యాక్టరీని సైతం తెలంగాణ నుంచి లాక్కుపోయింది ఎవరో గుర్తుంచుకోవాల ని గ్రాడ్యుయేట్లని మంత్రి కేటీఆర్‌ కోరారు. టీఆర్‌ఎస్‌కు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జీలతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పార్టీ అభ్యర్థుల గెలుపే మన గెలు పు అనుకొని అందరూ బాగా కష్టపడాలి. పార్టీ అభ్యర్థుల గెలుపును ప్రతి ఒక్కరూ సవాల్‌గా తీసుకోవాలి. తప్పకుండా రెండు స్థానాలు మనమే గెలుస్తున్నాం. గెలుపుపై ధీమా ఉండాలి.. అయితే ఆ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని పక్కాగా అమలుచేయాలి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి’ అని ఉద్బోధించారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం పరిధిలో లక్షన్నరకుపైగా కొత్త ఓటర్లు చేరారని, వారిని పోలింగ్‌ మూత్‌ వరకు తీసుకువెళ్లే బాధ్యత ఇంచార్జిలదేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అసత్యాలను తిప్పికొట్టండి

ఎన్నికలు వచ్చినప్పుడు తమ ఉనికి కోసం పాకులాడే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నిజస్వరూపాన్ని ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొట్టాలని మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గులాబీ సైనికుడు 50 మంది పట్టభద్రులను కలిసి వాస్తవాలు వివరించాలని చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణకు మొండిచెయ్యి చూపిన కేంద్రం నైజాన్ని పట్టభద్రులకు వివరించాలని చెప్పారు. కేవలం ఆరున్నరేండ్లలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని ఆధారాలతో సహా వివరించాలని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 14 వేల పరిశ్రమలు స్థాపించటం వల్ల 14 లక్షల మందికి ఉద్యోగాలను సృష్టించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ను రద్దుచేయడం వల్ల లక్షలాది తెలంగాణ యువత ఉపాధి ఆశలకు గండికొట్టిన వైనాన్ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 

రెండుస్థానాలు గెలిచేది మనమే

రెండింటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు తామే గెలుస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛంద మద్దతు లభిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ముందుకు సాగాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం త్వరలో మరో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని విద్యావంతుల దృష్టికి తీసుకెళ్లాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. 

Advertisement
మన గెలుపే బీజేపీకి జవాబు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement