శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:22:46

మా తపన.. విశ్వనగరం

మా తపన.. విశ్వనగరం

 • ఆ దిశగా ఇప్పటికే అనేక అడుగులు పడ్డాయి 
 • 67 వేల కోట్లతో మౌలిక వసతుల కల్పన
 • నీళ్లు, కరెంట్‌, రోడ్లు, భద్రతకు ప్రాధాన్యం
 • ఈసారి డ్రైనేజీ, చెరువులు, మూసీ అభివృద్ధి 
 • పాతబస్తీలో 10-12 స్థానాల్లో గెలుస్తాం
 • 72 శాతం టికెట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే
 • టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే మేయర్‌, డిప్యూటీ
 • హైదరాబాదీలూ.. నగరాన్ని పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు
 • నేమ్‌ చేంజర్స్‌ కావాలో.. గేమ్‌ చేంజర్స్‌ కావాలో తేల్చుకోండి 
 • హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతింటే బాధ్యత ఎవరిది?
 • ప్రధాని నరేంద్రమోదీ కొత్త స్కీమ్‌ ‘బేచో ఇండియా’ 
 • ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు ధ్వజం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే టీఆర్‌ఎస్‌ తపన, లక్ష్యమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ఉద్ఘాటించారు. ఈ దిశగా గత ఆరేండ్లలో అనేక అడుగులు పడ్డాయని చెప్పారు. రూ.67 వేల కోట్లతో హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. విశ్వనగరాలు రాత్రికి రాత్రే నిర్మాణం కావని, ఏండ్ల సమయం పడుతుందని చెప్పారు. ఈ ఆరేండ్లలో నీళ్లు, కరెంట్‌, వ్యర్థాల తొలిగింపు, రోడ్లు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామని,  ప్రజలు ఈసారి దీవిస్తే డ్రైనేజ్‌, సీవరేజ్‌, లేక్స్‌, మూసీపై దృష్టిపెడుతామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఒక టీవీ చానల్‌ లైవ్‌ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. తమకు ఎవరితోనూ పొత్తు లేదని, టీఆర్‌ఎస్‌ మహిళా అభ్యర్థే మేయర్‌ పీఠంపై కూర్చుంటారని ధీమా వ్యక్తంచేశారు. 72% టికెట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే కేటాయించి సామాజిక న్యాయం పాటించామన్నారు. పాతబస్తీలోనూ 10-12 స్థానాలు గెలుస్తామన్నారు. ఆరేండ్లలో హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. మతం పేరిట భావోద్వేగాలను రెచ్చగొట్టే పిచ్చోళ్ల చేతిలో రాయిలా హైదరాబాద్‌ నగరాన్ని చేయవద్దని ప్రజలను కోరారు. విద్వేషాలు చెలరేగి బ్రాండ్‌ హైదరాబాద్‌ ఇమేజ్‌ దెబ్బతింటే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కొట్లాటలు, గొడవలు చెలరేగితే పెట్టుబడులు వెనక్కి పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. 

ఒక వర్గమంటే అలర్జీ ఎందుకు?

మతతత్వంతో ముస్లింలందరినీ శతృవులుగా చూడటం సరికాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ‘ఒక వర్గమంటే అంత అలర్జీ ఎందుకు?’ అని నిలదీశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్రమంత్రి అమిత్‌షా.. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.లక్షకోట్ల ప్యాకేజీ ఇస్తామని చెప్తే తానే స్వయంగా వెళ్లి అభినందిస్తానని అన్నారు. అరాచకం కావాలో అభివృద్ధి కావాలో.. నేమ్‌ చేంజర్స్‌ కావాలో? గేమ్‌ చేంజర్స్‌ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే.. 

ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నాం 

ఇప్పుడు జరుగుతున్నవి హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు అనే విషయాన్ని విపక్షాలు మరచిపోయాయి. స్థానిక అంశాలు మరుగునపడ్డాయి. మేం అభివృద్ధి ఎజెండాతో ముందుకు పోతాం, ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పాం. నగరంలో మా పాలనలో కరెంట్‌ సమస్య తీరిపోయింది. ఇప్పుడు కరెంట్‌ పోతే వార్త. రూ. 2,000 కోట్ల హడ్కో రుణం తెచ్చి సమస్యకు 95% పరిష్కారం చూపాం. శివారు మున్సిపాలిటీల్లోనూ ఒకప్పుడు తీవ్ర నీటి కొరత ఉండేది. ఇప్పుడా పరిస్థితులు లేవు. విశ్వనగరంలో వీధికుక్కలు, దోమలు, పొల్యూషన్‌ కూడా ఉండకూడదు. అక్కడిదాకా వచ్చామా అంటే రాలేదు. రోమ్‌ నగరాన్ని ఒక్క రాత్రే నిర్మించలేదు. విశ్వనగరాలు ఒకేఒక రోజున కావు. ప్రధాన సమస్యలను ముందు పరిష్కరించుకోవాలి. విశ్వనగరాల్లో ఇండ్లలోనే పొడి, తడి చెత్తను వేరు  చేస్తారు. వాటిని ద్వారా విద్యుత్‌, ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ హైదరాబాద్‌లో కూడా చేస్తున్నాం. చెత్త సేకరణకు 2,500 ఆటోలు పెట్టాం. ఇలా దశల వారీగా వెళ్లాలిగానీ, ఒకేసారి మ్యాజిక్‌ చేయడం సాధ్యం కాదు. విశ్వనగరం అనేది మా తపన, లక్ష్యం. 

వచ్చే ఐదేండ్లలో ఎంతో మార్పు 

పిండి కొద్దీ రొట్టె ఉంటుంది. మొత్తం హైదరాబాద్‌ను ఆధునీకరించాలంటే రూ.15 - 20 వేల కోట్లు కావాలి. వందేండ్లలో ఎన్నడూ రాని వర్షం ఇటీవల పడింది. గడిచిన నాలుగేండ్లలో ఇలాంటి పరిస్థితి రాలేదు. అందుకే దీని కంటే ఇతర వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. అందుకే ఇప్పటివరకు రోడ్లు, శానిటేషన్‌, విద్యుత్‌, నీళ్లపై దృష్టి సారించాం. వీటితోపాటు అనేకం చేశాం. వచ్చే ఐదేండ్లలో చెరువులు, నాలాలు, మూసీని సుందరీకరించడం.. ఇలా పక్కా ఎజెండాతో ముందుకెళ్తున్నాం. మార్పును తప్పకుండా చూస్తారు. 

పెద్ద మొత్తంలో కేటాయింపులు 

ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ కోసం రూ.10 వేల కోట్లు కేటాయించారు. వరుసగా ఐదేండ్లలో ప్రతి ఏడాది రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారు. మిషన్‌ హైదరాబాద్‌ పేరిట ఈ పనులు చేయబోతున్నాం. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఎలాంటి కొరత లేదు. ముంబైలో ప్రాపర్టీ టాక్స్‌ రూ.4-5 వేల కోట్లు, బెంగళూరులో రూ.19 వందల కోట్లు వస్తున్నది. మేం ఇక్కడ ప్రాపర్టీ టాక్స్‌, స్టాంపు డ్యూటీ, విద్యుత్‌ టారిఫ్‌, డెవలప్‌మెంట్‌ టాక్స్‌  పెంచలేదు. సామర్థ్యం పెంచాం. జీహెచ్‌ఎంసీ ఆదాయం పెంచే ప్రయత్నం చేశాం. ముంబైలో ఆక్ట్రాయ్‌ పన్ను కూడా ఉంది. మన దగ్గర అలాంటివి లేవు. ఎన్నికల వేళ మేం వరాలు ప్రకటించడం లేదు. టాక్స్‌ కట్టేవారికి మినహాయింపులు ఇచ్చాం. శానిటేషన్‌ వర్కర్ల జీతాలు నాలుగుసార్లు పెంచాం. ఇలా ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిర్ణయాలు తీసుకున్నాం. 

ఆక్రమణలకు చెక్‌ పెట్టేలా కొత్త చట్టం..  

హైదరాబాద్‌లో ఆక్రమణలు చాలావరకు తొలిగించాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అసెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ద్వారా చాలా పనులు చేశాం. చెరువులు, నాలాలు, రోడ్ల ఆక్రమణను అడ్డుకునేలా, జనవరిలో లేదా ఫిబ్రవరిలో కొత్త్త చట్టం తీసుకొస్తాం. అందులో ప్రజల స్థలాలను ఆక్రమిస్తే నోటీసు కూడా ఇవ్వకుండా కూల్చేసేలా చర్యలు ఉంటాయి. చెక్‌ అండ్‌ బ్యాలెన్స్‌ కోసం కొత్త చట్టం ద్వారా ప్రతి డివిజన్‌లో సీనియర్‌ సిటిజన్స్‌, ఎమినెంట్‌ సిటిజన్స్‌, యూత్‌, మహిళలతో నాలుగు వార్డు కమిటీలు ఏర్పడుతాయి. ప్రతి కమిటీలో కనీసం 25 మంది ఉంటారు. 150 డివిజన్లలో కలిపి మొత్తం 15,000 మంది పురసైనికులు అవుతారు. వారి సలహాలు స్వీకరించి జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌లో చర్చిస్తాం. దేశంలో అనేక చట్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. పయనీరింగ్‌ పాలసీలను తీసుకువచ్చాం. మన చట్టాలను మిగిలిన రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. కొత్త జీహెచ్‌ఎంసీ చట్టాన్ని అదే విధంగా రూపొందిస్తాం. 

పాతబస్తీలో మెట్రోకు ఎంఐఎం అడ్డంకి

మెట్రో పాత బస్తీకి వెళ్లకుండా ఎంఐఎం అడ్డుకున్నది. మెట్రోకు కరోనా సమయంలో రూ.1900 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు. ఓల్డ్‌ సిటీకి అవసరమైతే ప్రభుత్వమే రూ.1200 కోట్ల ఖర్చు చేసైనా ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేద్దామనుకుంటున్నాం. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం. 


సిటీ సోల్‌ కాంక్రీట్‌ నిర్మాణాల్లో ఉండదు 

సిటీ సోల్‌ కాంక్రీట్‌ నిర్మాణాల్లో ఉండదు. అది కల్చరల్‌ ఎకో సిస్టమ్‌లో ఉంటుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో నగరంలో హైదరాబాద్‌ హ్యాబిటాట్స్‌ సెంటర్‌ పెట్టాలని అనుకున్నారు. కానీ అది జరగలేదు. కానీ తారామతి బారాదరి దగ్గర 40  ఎకరాల్లో హైదరాబాద్‌ థియేటర్స్‌ డిస్ట్రిక్ట్‌ తీసుకురావాలని అలోచన ఉన్నది. ఎందుకంటే అది కళలకు అన్నింటికీ కేంద్రంగా ఉంటుంది.  ఢిల్లీలో కింగ్‌డమ్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌ అనే కేంద్రం ఉంది. దాని మాదిరిగా ఇక్కడ తీసుకురావాలని ఉన్నది. అన్ని కల్చరల్‌, లిటరరీ ఫెస్టివల్స్‌ అక్కడే నిర్వహించుకోవచ్చు. సిటీకి  సాంస్కృతిక, సామాజిక వాతావరణం ఉన్నప్పుడే నగరం బతుకుతుంది. 2014, 2015లో ఉద్వేగంగా మాట్లాడినం కానీ ఎవరినీ కించపరచలేదు. ఎప్పుడూ మేము మత ద్వేషాలు పెంచేలా మాట్లాడలేదు. రాష్ట్రం వచ్చాక ఎక్కడా చిన్న పొరపొచ్చాలు వచ్చేలా ప్రవర్తించలేదు. రాజకీయాల్లో గెలుపు, ఓటమి, నాలుగు ఓట్లు, నాలుగు సీట్లు రావొచ్చు.. రాకపోవచ్చు. కానీ నేడు విద్వేషపూరిత మాటలతో  25-30 శాతం ఉన్న ముస్లింలను ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంత వరకు మంచిది? ఒక లోకల్‌ బాడీ ఎన్నికల్లో భావోద్వేగం పెంచి లాభం పొందాలనుకొంటే సాధ్యం కాదు. హైదరాబాద్‌లో అంత అమాయకులెవరూ లేరు.

హైదరాబాద్‌కు నష్టం జరిగితే ఊరుకునేది లేదు 

వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. కెలికి కయ్యం పెట్టుకోవాలి.. పిల్లల్ని రెచ్చగొట్టి.. నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి. సీజన్‌కొక పిచ్చొడు వస్తూనే ఉంటాడు.. వీరిని మేం పట్టించుకోం. కానీ అదుపుతప్పే పరిస్థితే వస్తే మాత్రం శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంఐఎం నాయకులైనా, బీజేపీ నాయకులైనా, చివరికి టీఆర్‌ఎస్‌ నాయకులైనా సరే వారి మీద కూడా కేసులు పెట్టి లోపలేస్తాం. మాకు హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ముఖ్యం. హైదరాబాద్‌ ఈ రాష్ర్టాన్ని నడుపుతున్న ఆర్థిక ఇంజన్‌. హైదరాబాద్‌ దెబ్బ తింటే తెలంగాణ దెబ్బతింటది. హైదరాబాద్‌ మంచిగుంటే తెలంగాణ మంచిగుంటది. ఎకానమీ మీద, నిరుద్యోగం మీద మాట్లాడండి. 

వాళ్లు చేసింది మేం చెప్పుకోలేదు 

కాంగ్రెసోళ్లు భూమి పుట్టినప్పుడు పుట్టారు.. 65 ఏండ్లలో ఏం చేశారో చెప్తున్నారు.. కానీ వారి హయాంలో చేపట్టిన పనుల్లో మెజార్టీ శాతం మేమే పూర్తి చేశాం. మెట్రోకు ఎక్కువ నిధులు ఖర్చు పెట్టింది మేము. వారు చేసిన పనుల క్రెడిట్‌ను వారికే ఇస్తాం. స్వయంగా సీఎం కేసీఆరే అసెంబ్లీలో చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం మంచిదని చెప్పినం. కానీ జవహర్‌నగర్‌లో డంప్‌యార్డ్‌కు మేము క్యాపింగ్‌ చేస్తే ఆ బొమ్మను యథాతథంగా తీసుకొచ్చి మ్యానిఫెస్టోపై పెట్టుకుంది. షీ టాయ్‌లెట్స్‌ బొమ్మల్ని పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఓ సామెత ఉంది. నకల్‌ మార్నేకేలియే బీ అఖల్‌ చాహియే (నకలు కొట్టాలంటే కూడా తెలివి ఉండాలి) అది వీరికి లేదు. 

మ్యానిఫెస్టోలోనే సగం హామీలు మింగేశారు 

వరద బాధితులకు బండి సంజయ్‌ రూ.25వేల ఇస్తామన్నరు. కానీ మ్యానిఫెస్టోలో మాత్రం రూ.15 వేలు పెట్టారు. వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. కానీ ఎలక్షన్స్‌కు ముందే హామీల్లో కోతలు పెడుతున్నరు. చలాన్లు కడతామన్నరు దాన్ని మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామన్నరు.. దాన్ని కూడా మ్యానిఫెస్టోలో పెట్టలేదు. వాళ్లు చెప్పేదొకటి చేసేదొకటి. ఏది నమ్మాలి? 

ఎంఐంఎంతో మాకు పొత్తు లేదు.. 

ఎంఐఎంకు మాకు ఎక్కడ పొత్తు ఉంది? కేంద్రంలో ఉన్న బీజేపీకి జీఎస్టీ విషయంలో, వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిగా  ఎన్నుకోవటానికి మద్దతు ఇచ్చాం.. ఆర్టికల్‌ 370కి, రాష్ట్రపతిగా రాంనాథ్‌కోవింద్‌ ఎన్నికకు మద్దతు ఇచ్చాం.. అలా అని ఇద్దరం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నమా? టీఆర్‌ఎస్‌-ఎంఐఎం సర్కారుపై చార్జిషీట్‌ అని ప్రకాశ్‌ జవదేకర్‌ ఓ పుస్తకం విడుదల చేశారు. అయనకేమైనా తెలివుందా? ఇక్కడ టీఆర్‌ఎస్‌-ఎంఐఎం సర్కారు ఉన్నదా? ఎన్నికల్లో కలిసి పోటీ చేసినమా?  మూసారాంబాగ్‌, ఐఎస్‌ సదన్‌, గుడిమల్కాపూర్‌, జియాగూడ సీట్లు గెలిచింది మేము. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు అసదుద్దీన్‌ వచ్చి సీఎం కేసీఆర్‌తో చర్చించి వెళ్లారన్న వార్తలు అవాస్తవం. ఆరోజు ఆయన సీఎం కార్యాలయ అధికారులను కలిసి వెళ్లిపోయారు. ఎంఐఎం మాకు అంశాలవారీగా మద్దతు ఇస్తున్న విషయం వాస్తవమే. అంతేకానీ మాకు ఎలాంటి ఫిక్సింగ్‌ లేదు. కాంగ్రెస్‌, బీజేపీ మాదిరిగానే జీహెచ్‌ఎంసీలో ఎంఐఎంను కూడా ఎదుర్కొంటాం. ఈ సారి మేం పాతబస్తీలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని పక్కాగా చెప్తున్నా. గతంలో కూడా జీహెచ్‌ఎంసీలో సెంచరీ కొడతామంటే అతి విశ్వాసం అనుకున్నారు. రిజల్ట్‌ మీరే చూశారు. ఈసారి కూడా చూస్తారు. ఎవరి మద్దతు అవసరం లేకుండానే హైదరాబాద్‌ ప్రజల మద్దతుతో టీఆర్‌ఎస్‌ పార్టీ జీహెచ్‌ఎంసీలో గౌరవప్రదమైన సీట్లు గెలుచుకుంటుంది. గులాబీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్‌ మహిళా అభ్యర్థే హైదరాబాద్‌ మేయర్‌గా ప్రమాణం చేస్తారు. డిప్యూటీ మేయర్‌కూడా మేమే అవుతాం.   

లక్షకోట్లిస్తే అమిత్‌షాను స్వయంగా అభినందిస్తా 

ఆరేండ్లలో హైదరాబాద్‌కు ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? తెలంగాణ లాంటి పురోగమన రాష్ర్టాలు చెల్లించే పన్నులతోనే ఇతర వెనుకబడిన రాష్ర్టాలు బతుకుతున్నాయి. కానీ బీజేపీ వాళ్లు తామే డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టే మేం కూడా మేమే మీకు పన్నులు చెల్లించామని స్పష్టంగా చెప్తున్నాం. ఎన్డీఆర్‌ఎఫ్‌ నుంచి ఏడాదికి రూ.448 కోట్లు మన రాష్ర్టానికి వస్తాయి. అందులోవే మనకు వరదలు వచ్చినప్పుడు రూ.244 కోట్లు ఇచ్చారు. అవి ఇచ్చి అదనంగా ఏవో ఇచ్చినట్టు చెప్పుకుంటున్నరు. అవి కాకుండా కర్ణాటకకు రూ.660 కోట్లు ఇస్తరు. గుజరాత్‌కు రూ.500 కోట్లు ఇస్తరు? మరి హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వరు? రేపు అమిత్‌షా ప్రచారానికి వస్తున్నారని తెలిసింది.. హైదరాబాద్‌కు లక్షకోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తాం అని ఆయన ప్రకటిస్తే.. నేనే వెళ్లి ఆయన మెడలో దండ వేసి అభినందించి వస్తా.

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు  


శేరిలింగంపల్లి ప్రాంతంలో ఐదు లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో ఐదు లక్షల మంది అక్కడికి వస్తారు. ఇలా ప్రతి రోజు 10 లక్షల మంది వస్తూ, పోతూ ఉంటారు. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఎక్కువ ఉంటుంది. వారి అవసరానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎల్బీనగర్‌లో, ఉప్పల్‌,  కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి.. ప్రతి చోటా అభివృద్ధి జరుగుతున్నది. ఎస్సార్డీపీ కింద 18 ఫ్లైవోవర్లు పూర్తి చేశాం. బాలానగర్‌ ఫ్లైవోవర్‌ పూర్తి కావచ్చింది. ఒకేచోట అభివృద్ధి చేశామనే మాట సరికాదు. గ్రిడ్‌ పాలసీ తీసుకొచ్చాం. పశ్చిమ హైదరాబాద్‌లోని నాగోల్‌, ఎల్బీనగర్‌, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తెచ్చాం. ఇక్కడ ఐదు ఐటీ పార్కులు రాబోతున్నాయి. కొంపల్లిలో 200 చిన్న ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌లను తీసుకొస్తున్నాం. \

జోనల్‌ కమిషనర్లకు అధికారాలు 

డివిజన్లలో తాగునీరు సహా అనేక చిన్నచిన్న పనులు చేయటానికి రూ.2 కోట్ల విలువైన పనులను చేపట్టే అధికారాన్ని జోనల్‌ కమిషనర్లకు ఇచ్చాం. ఆ పనులకు జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయ అనుమతి అవసరంలేదు. దీంతో చిన్నచిన్న స్థానిక సమస్యలు వెంటనే పరిష్కమవుతాయి. రూ.300 కోట్లతో సీసీ రోడ్లు వేయడానికి కేటాయించాం. టోక్యో నగరాన్ని 23 వార్డులుగా విభజించి పనులు చేస్తారు. అదే విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాం. వరదల్లో నష్టపోయినవారికి రూ.10 వేలు ఇస్తే ఆపింది ఎవరో అందరికీ తెలుసు. డిసెంబర్‌ 4 తర్వాత అర్హులైన వారికి సాయం కొనసాగిస్తాం. ఇప్పటి వరకు 6.60 లక్షల మందికి ఇచ్చాం. హైదరాబాద్‌లోనే కాదు చుట్టు పక్కల మున్సిపాలిటీల వాళ్లకు కూడా ఇచ్చాం. అవసరమైతే రూ.100-200 కోట్లు ఇస్తాం.  

ఇది రాజకీయం కాదు.. అరాచకీయం.. 

ఓల్డ్‌ సిటీని అభివృద్ధి చేస్తాం అని మాట్లాడమనండి.. ఓల్డ్‌ సిటీలో బాంబులు వేయడమా వీళ్ల ఏజెండా.. ఓల్డ్‌ సిటీలో హిందువులు లేరా..? పన్నులు కట్టని వారు ఓల్డ్‌ సిటీలో ఉన్నారు.. ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నారు. ఓల్డ్‌ సిటీ అంటే, ముస్లింలంటే ఎందుకంత ద్వేషం మీకు? పేదవాళ్లు ఉండే బస్తీలు ఎన్నో ఉన్నాయి.. నీళ్ల బిల్లులు కట్టనివారు అంతటా ఉన్నరు. కానీ వాళ్లు మాత్రం ఒక్క ఓల్డ్‌ సిటీనే టార్గెట్‌ చేయడమే వారి దుర్మార్గపు ఆలోచనకు ప్రతీక. ముస్లింల మీద అంత గుడ్డి ద్వేషం ఎందుకు? వీరిని సమాజానికి దూరం చేస్తే ఏం లాభం? హైదరాబాద్‌కు మంచిదా..? గోకుల్‌ చాట్‌ పేలుళ్లు, లుంబినీ పార్కు పేలుళ్ల్లు.. మత కల్లోలాలు, కర్ఫ్యూలు. నేను చిన్నగున్నప్పుడు వారం పది రోజులు సెలవులు ఉండేవి. ఇలాంటి రాజకీయం వల్ల మళ్లీ అవన్నీ హైదరాబాద్‌కు రావాలా? ఇది రాజకీయం కాదు.. అరాచకీయం.   

మ్యానిఫెస్టోనే తయారు చేసుకోలేరు..

హైదరాబాద్‌కు మోదీ వస్తున్నారు కదా.. ఐటీఐఆర్‌ గురించి ఆయనతో చెప్పించండి.. ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరు? ఇలా గత ఆరేండ్లలో ఏం చేశారంటే చెప్పరు.. కానీ గాలి మాటలు మాట్లాడుతారు. జుమ్లాలు తప్పా మరేమీ లేదు. మ్యానిఫెస్టోలో కూడా మా పథకాలను కాపీ కొట్టారు. మ్యానిఫెస్టోనే తయారు చేసుకోలేనోళ్లు.. హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు?

హైదరాబాద్‌ ఇమేజ్‌ దెబ్బతింటే బాధ్యత ఎవరిది? 

హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉంటే ఏరేయాల్సింది ఎవరు?  ఆరేండ్లుగా వారి ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది. ఇంతకాలం ఏం చేస్తున్నారు? అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ కలిసి గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా? ఆరేండ్లుగా మన దేశంలోకి ఎవరో చొచ్చుకొస్తుంటే వాళ్లు ఏం చేస్తున్నారు? వారికి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు ఎవరిచ్చారు? కేంద్రం ఇవ్వలేదా? చేయాల్సిందంతా వాళ్లు చేసి.. అసలు ఇక్కడ ఉన్నారో లేదో తెలియని వాళ్లను బూచిగా చూపించి రాద్ధాంతం చేస్తున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి ఆరేండ్లలో హైదరాబాద్‌కు ఏం చేశారో చెప్పు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు.. అంటే అవేవీ చెప్పకుండా.. అక్బరు, బాబరు గురించి మాట్లాడుతున్నరు. హైదరాబాద్‌లో అగ్గిపెడితే, వీళ్ల మాటల వల్ల ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు?  హైదరాబాద్‌ ఇమేజ్‌ దెబ్బతింటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? వీళ్లు తీసుకుంటారా? 

రూ.9,714 కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు 


ముంబై, చన్నై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రధాన నగరాల్లో లేనివిధంగా హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా ఇస్తున్నాం. రూ.9,714 కోట్లతో 110 ప్రాంతాల్లో ఇండ్లను నిర్మిస్తున్నాం. అక్కడ ఇండ్లు లేకుంటే మాకు ఓటు వేయకండి. కొల్లూరులో చేపట్టిన ప్రాజెక్టుకు హడ్కో కూడా అవార్డు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో 15,660 ఇండ్లు కట్టాం. కండ్లు ఉండి కూడా చూడలేకుంటే ఏం చేయలేం. కరోనా సమయంలో వలస కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లడం, ఆర్థికంగా ఆదాయం తగ్గడంతో ఇండ్ల నిర్మాణం కొంత ఆలస్యమైన మాట వాస్తవం. 


logo