బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 17:05:32

మన ఆరోగ్యం మన చేతుల్లోనే

మన ఆరోగ్యం మన చేతుల్లోనే

సిద్దిపేట  : ప్లాస్టిక్‌ రహిత పట్టణానికి పునాది స్టీల్‌ బ్యాంకు అని.. ప్లాస్టిక్‌ వాడితే క్యాన్సర్‌ లాంటి భయంకరమైన వ్యాధులు దరి చేరుతాయని.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని 4,9,13 వార్డుల్లో బాల వికాస, మున్సిపాల్టీ సంయుక్త భాగస్వామ్యంతో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్యాంకులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ స్టీల్‌ బ్యాంకు మన వార్డులోని ప్రజలు ఇండ్లలో ఏ ఫంక్షన్‌ చేసుకున్నా తక్కువ ధరలోనే స్టీల్‌ వస్తువులను పొందవచ్చని, ఇందులో 12 రకాల వస్తువులు, 750 ప్లేట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డబ్బు పోతే తిరిగి వస్తుందని, ప్రజల ఆరోగ్యమే తనకు ముఖ్యమన్నారు. 

పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపాలని పిలుపునిచ్చారు. ఇంట్లో చెత్త ఉండవద్దని, మన ఇండ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. పర్యావరణ ప్రేమికురాలు డా.శాంతి చేపట్టిన కార్యక్రమాలతో మూడు వారాల్లోనే చాలా మార్పు వచ్చింది, బయట చెత్త వేస్తే రూ.500 జరిమానా విధించాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. అంతకు ముందు 4వ వార్డులో భువనగిరి బాలమణి ఇంట్లో శుభకార్యక్రమానికి హాజరై మంత్రి చేతుల మీదుగా స్టీల్‌ బ్యాంకు సామగ్రిని అందజేశారు.

వార్డు ప్రజల చేత సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వాడమని, ఇక నుంచి మటన్‌, చికెన్‌ షాపుల మార్కెట్లకు వెళ్తే స్టీల్‌ బాక్సులు, జనపనార బట్ట సంచిని తీసుకెళ్తామని, ప్లాస్టిక్‌ రహిత, స్వచ్ఛ  సిద్దిపేట కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని మనసాక్షిగా ప్రతిజ్ఞ చేయించారు. గోదావరి జలాలను మరో 15 రోజుల్లో నర్సపురానికి తేనున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా ఉధృతి తగ్గాక డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను కూడా నర్సపురం వాసులకు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. 


logo