గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 11, 2020 , 11:11:25

రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదర్శంగా మన గురుకులాలు : మంత్రి కొప్పుల

రాష్ర్టాలకు, కేంద్రానికి ఆదర్శంగా మన గురుకులాలు : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌ : ఇతర రాష్ర్టాలకు, కేంద్రానికి కూడా మన గురుకుల పాఠశాలలు ఆదర్శంగా నిలిచినట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశాయన్నారు. పేద విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకే ప్రభుత్వం గురుకులాలను నెలకొల్పినట్లు తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 602 గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. వీటి నిర్వహణకు రూ.5,719 కోట్లు ఖర్చుచేసినట్లు చెప్పారు. రుక్మాపూర్‌లో అద్భుతంగా సైనిక్‌ స్కూల్‌ను నిర్వహిస్తున్నామన్నారు. గతంలో డిగ్రీస్థాయిలో మహిళలకు రెసిడెన్సియల్‌ కాలేజీలు లేవన్న మంత్రి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల కోసం 30 కాలేజీలు ప్రారంభించిందన్నారు. బోధనకు సంబంధించి 120 అద్దె భవనాల్లో 54 భవనాలు మంజూరు కాగా ఇప్పటికే 19 భవనాలు దాదాపు నిర్మాణం పూర్తిచేసుకున్నాయన్నారు. 41 భవనాలు ప్రారంభించుకుకోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. భారతదేశంలో మైనార్టీలకు రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. మన గురుకుల విద్యావిధానాన్ని అసోం, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ వంటి ఇతర రాష్ర్టాలు అడాప్ట్‌ చేసేందుకు ముందుకు వస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


logo
>>>>>>