బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Sep 26, 2020 , 03:17:17

విభజించు.. దారిమళ్లించు

విభజించు.. దారిమళ్లించు

  • ఇదీ ఎన్డీయే సర్కారు పన్నాగం
  • వ్యవసాయ బిల్లులను మరుగునపరిచే కుట్రలు
  • అనుకూల మీడియాలో తెరపైకి ఇతర అంశాలు
  • ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎజెండాతో ముందుకు

నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని అమలు చేస్తే.. నేటి ఎన్డీయే సర్కారు ‘విభజించు.. దారిమళ్లించు’ సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అన్నదాతల బతుకులను రోడ్డున పడేసే కీలక బిల్లులను వక్రమార్గంలో తీసుకొచ్చిందని, వాటిపై రైతుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకు ఎత్తులు వేస్తున్నదని చెపుతున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోతరహా అలజడిని సృష్టిస్తూ చూపును మరల్చే కుయుక్తులు పన్నుతున్నదంటున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్రం మూడు నెలల కిందటే వ్యవసాయ బిల్లుల ఆర్డినెన్స్‌ను జారీచేసింది. అప్పటినుంచే అన్నదాతల నుంచి వ్యతిరేకత మొదలైంది. వాటిని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేసమయానికి మరింత వ్యతిరేకత ఖాయమని ముందే పసిగట్టింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి కొద్దిరోజుల ముందు నుంచే ఒక్కసారిగా ఎక్కడాలేని వివాదాలను తెరమీదకు తీసుకొచ్చిం ది. ప్రజలందరి దృష్టి వాటిపైనే కేంద్రీకృతమయ్యేలా చేసి, ఎలాంటి చర్చ లేకుండానే ఆ బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ లో ఆలయాల పేరిట గొడవలు, పంజాబ్‌, హర్యానాలో పొలిటికల్‌ హైడ్రామాలు, మహారాష్ట్రలో కంగనా కయ్యం, తమిళనాడులో శశికళ అంశాన్ని తెరపైకి తెచ్చిందని చెప్తున్నారు.

ఏపీలో ఆలయాల పేరిట రగడ

పార్లమెంట్‌ సమావేశాలకు కొద్దిరోజుల ముందే ఏపీలో అంతర్వేది ఆలయంలోని రథం దగ్ధంకావడం, శ్రీకాళహస్తిలో అజ్ఞాతవ్యక్తులు రాతి నంది, శివలింగం విగ్రహాలను ఏర్పాటుచేయటంఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ఇదేఅదనుగా బీజే పీశ్రేణులు ఏపీవ్యాప్తంగా ఆం దోళనలకు పిలుపునిచ్చాయి. ఆ రాష్ట్ర రైతులు, ప్రజల దృష్టిని తమవైపు తిప్పుకున్నాయి. సీఎం జగన్మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటనపై రాద్ధాంతం చేసి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా సఫలీకృతమైంది’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, కేంద్రం బిల్లులతో ఎక్కువగా నష్టపోయే పంజాబ్‌, హర్యానా రైతులు ఆర్డినెన్స్‌లు జారీఅయిన నాటినుంచే ఆందోళన బాటపట్టారు. ఎన్డీయేలో భాగస్వామ్యమైన శిరోమణి అకాళీదల్‌నేత, కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌కౌర్‌ బిల్లులకు వ్యతిరేకంగా రాజీనామాచేసి పొలిటికల్‌ హైడ్రామాకు తెరలేపారు. మరోభాగస్వామి, హర్యానా ప్రభుత్వంలో మిత్రపక్షమైన జననాయక్‌ జనతా పార్టీ(జేజేపీ)సైతం రైతుల ఆందోళనలతో బిల్లులను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు కూడా తొలుత వచ్చిన ఆర్డినెన్స్‌లకు మద్దతిచ్చాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆ పార్టీలు యూటర్న్‌ తీసుకుని రాజకీయ డ్రామా కు తెరలేపాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మహారాష్ట్రలో కంగనా.. నానా హంగామా

మహారాష్ట్ర వాసుల దృష్టిని మరల్చేందుకు బీజేపీ వేసిన పాచిక నటి కంగనా రనౌత్‌. బీజేపీ దన్నుతో పార్లమెంట్‌ సమావేశాల ముందే ఆమె అక్కడి అధికార శివసేనపార్టీని టార్గెట్‌ చేస్తూ ట్వీట్లు చేయటంతోపాటు, ముంబైని ఏకంగా పాకిస్థాన్‌తో పోల్చి కొత్త వివాదానికి తెరలేపారు. దీనిపై ఎన్డీయే అనుకూల మీడియా సంస్థలు గంటగంటకు బ్రేకింగ్‌లు వేస్తూ యావత్‌ ప్రజానీకంలో ఉత్కంఠతను రేపాయి అని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడులో శశికళ జైలు నుంచి విడుదల అవుతుందనే విషయం గుప్పుమనటంతో ఒక్కసారిగా అక్కడ ఉత్కంఠ నెలకొంది. బిహార్‌లో ఆ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే వాలంటరీ రిటైర్మెంట్‌, ఛత్తీస్‌గడ్‌, జార్ఘండ్‌, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత రాష్ర్టాల్లో పోలీసుల ఆకస్మిక కూంబింగ్‌ వంటి అంశాలతో బీజేపీ సర్కార్‌ అసలు సమస్యను పక్కదోవ పట్టించిందంటున్నారు. మన రాష్ట్రంలోనూ బీజేపీ శ్రేణులు ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట రాద్ధాంతం చేద్దామని చూసినా ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కదిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జాతీయ మీడియాకూడా ఎన్డీయే కనుసన్నల్లోనే నడుస్తున్నది. దేశాన్ని ప్రభావితం చేయబోయే వ్యవసాయ బిల్లులపై చర్చలను కాదని, సుశాంత్‌సింగ్‌ మృతి, డ్రగ్స్‌, చైనా సరిహద్దు వివాదం వంటి అంశాలను మీడియాలో వచ్చేలా చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.