సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 07:44:59

నేటినుంచి ఓయూ ఇంజినీరింగ్‌లో ‘సింపోజియాలు’

నేటినుంచి ఓయూ ఇంజినీరింగ్‌లో ‘సింపోజియాలు’

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం, శనివారం అన్ని డిపార్ట్‌మెంట్లలో ప్రతి ఏటా నిర్వహించే సింపోజియాలకు సర్వం సిద్ధమైంది. వివిధ విభాగాల్లో వేర్వేరుపేర్లతో నిర్వహించే సింపోజియాల నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఆయా డిపార్ట్‌మెంట్లలో ఉండే మూడో సంవత్సరం విద్యార్థులు నిర్వర్తిస్తారు. అధ్యాపకులు కేవలం సలహాదారుల పాత్రకే పరిమితమవుతారు. ఈ సింపోజియాలలో భాగంగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. అంతేకాకుండా వివిధ అంశాలపై నిపుణులతో ఉపన్యాస కార్యక్రమాలు కూడా ఏర్పా టు చేస్తారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ పోటీల్లో విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు పాల్గొంటారు.  


ఇదీ నేపథ్యం...

ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు సాంస్కృతికపరమైన పోటీలను ‘అల్గోరిథమ్‌' పేరుతో గతంలో నిర్వహించేవారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఆలోచనతో 2002 సంవత్సరం నుంచి టెక్నికల్‌ సింపోజియంలను నిర్వహిస్తున్నా రు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ సింపోజియాలు ఉపయోగపడేలా రూపొందించారు. విద్యార్థుల తరగతులకు ఇబ్బంది కలుగకుండా ఈ సింపోజయం కార్యక్రమాలను ఓయూ ఆలూమ్నిలో చేర్చారు.  


మెకానికల్‌ విద్యార్థుల ‘మెకరీనా’

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు మెకరీనా పేరుతో సింపోజియం నిర్వహిస్తారు. థండర్‌బోట్‌, రొబోటిక్‌ ఈవెంట్‌, మూన్‌స్టర్‌ ట్రాక్‌, ఐడియా ప్రజెంటేషన్‌, ఆటో నోవా, పేపర్‌ ప్రజెంటేషన్‌, క్విజ్‌, లైవ్‌ ప్రాజెక్టులు తదితర విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. వర్సిటీ ల్యాబ్‌లో ఉన్న అధునాతన యంత్రాలను విద్యార్థుల చూసేందుకు వీలు గా ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. దాదాపు వెయ్యిమందికి పైగా విద్యార్థులు పోటీలకు హాజరయ్యే అవకాశం ఉంది. 


విద్యుత్‌ రంగ నిపుణుల కలయికగా ‘టెక్సోనెన్స్‌'

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో టెక్సోనెన్స్‌ పేరుతో నిర్వహించనున్న సింపోజియం విద్యుత్‌ రంగ నిపుణుల కలయికగా మారనుంది. ఈ సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా టీఎస్‌జెన్‌కో, టీఎస్‌ట్రాన్స్‌కో, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీలు, డైరెక్టర్లు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారిని ఘనంగా సన్మానించనున్నారు. దానితోపాటు వివిధ పేర్ల తో పేపర్‌ ప్రజెంటేషన్‌, పోస్టర్‌ ప్రజెంటేషన్‌, నాన్‌ టెక్నాలజీ క్విజ్‌, టెక్నాలజీ క్విజ్‌, లైవ్‌ ప్రాజెక్టులు, షార్ట్‌ ఫిల్మ్‌, మేకింగ్‌ ఆఫ్‌ సర్క్యుట్‌, కల్చరల్‌ పోటీలు నిర్వహిస్తారు. 


నిర్మాణాత్మకంగా సివిల్‌ విద్యార్థుల ‘నిర్మాణ్‌'

సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు నిర్మాణ్‌ పేరుతో సింపోజి యం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తారు. విద్యార్థులు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా పలునమూనాలను ప్రదర్శిస్తారు. గతంలో నదుల అనుసంధానం నమూనా, వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా రూపొందించిన రోడ్డు నమూనా, అండర్‌గ్రౌండ్‌ రైల్వేస్టేషన్‌, మిషన్‌ భగీరథ, నార్త్‌విచ్‌ స్వే బ్రిడ్జి, అండర్‌ వాటర్‌ కన్‌స్ట్రక్షన్‌, ఎర్త్‌క్వేక్‌ రిసిస్టెంట్‌ బిల్డింగ్‌, గ్రావిటీ డ్యాం, ైస్లెడిం గ్‌ బ్రిడ్జిలతోపాటు వివిధ రకాల బ్రిడ్జిలు, అండర్‌ గ్రౌండ్‌ పార్కింగ్‌ నమూనాలను ప్రదర్శించి తమ ప్రతిభ, సృజనాత్మకతను తెలియజేశారు. పేపర్‌ ప్రజెంటేషన్‌, టెక్నో జనరల్‌ క్విజ్‌, క్యాడ్‌మానియా, ట్రెజర్‌హంట్‌, సేజ్‌ ఆన్‌ స్టేజ్‌ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. 


బహిర్గతంకానున్న విద్యార్థుల ప్రతిభ

ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఆకృతి పేరుతో సింపోజియం ఏర్పాటు చేస్తారు. ఇందులోభాగంగా అన్ని శాస్త్ర సాంకేతిక పరికరాల పురాతన మోడళ్లతో ప్రదర్శన ఏర్పా టు చేస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు ఇన్ఫినిటీ పేరు తో, బయోమెడికల్‌ విభాగంలో మెడిటెక్‌ పేరుతో సింపోజియంలు నిర్వహించనున్నారు.


logo