ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:05:49

ప్రజారోగ్యంపైనా రాజకీయమేనా?

ప్రజారోగ్యంపైనా రాజకీయమేనా?

  • కొత్త భవనం అప్పుడే కట్టిఉంటే.. ఇప్పుడీ దుస్థితి వచ్చేదా?
  • ఉస్మానియా దవాఖానను నూతనంగా నిర్మించాల్సిందే
  • ఉస్మానియా దవాఖాన స్థితిపై అన్ని వర్గాల ఏకాభిప్రాయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారీవర్షం కారణంగా ఉస్మానియా జనరల్‌ దవాఖానలోకి నీళ్లు రావడంపై విపక్షాలు చేస్తున్న చౌకబారు రాజకీయాలపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. దవాఖాన స్థితి, దాని పునర్నిర్మాణంపై విపక్షాల తీరు పట్ల అన్ని వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. గురువారం ఉద్యోగ ఉపాధ్యాయ, వైద్య సంఘాల నాయకుల నుంచి సామాన్యుల వరకు.. అందరూ ఉస్మానియా దవాఖానను తక్షణం కూల్చి తిరిగి నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. శిథిలావస్థకు చేరుకొన్న ఉస్మానియా భవనాన్ని కొత్తగా కట్టడానికి సీఎం కేసీఆర్‌ చొరవ చూపినప్పటికీ, కొందరు నాయకుల రాజకీయాల వల్ల ఆగిపోవడం దుర్మార్గమన్న ఉస్మానియా జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ, డాక్టర్‌ శ్రావణ్‌ అభిప్రాయంతో అన్ని వర్గాలు ఏకీభవిస్తున్నాయి. నూతన భవనం ఏర్పాటైతే రోగులకు మరింత మేలు జరిగేదని అంటున్నారు. ఉస్మానియా దవాఖానలో రోగులు, వైద్యులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉన్నదని హాస్పిటల్‌లో నిత్యం ఇక్కట్లు పడుతున్న వారి ఆవేదన ప్రతిపక్షాల చెవికెక్కడంలేదు. మరమ్మతులు చేసినా ఉపయోగించే స్థితిలో లేని భవనాన్ని అలాగే కాపాడాలంటూ వింత డిమాండ్‌ చేస్తున్నాయి. 

ప్రతిపక్షాలే అడ్డుపడ్డాయి

నూతన భవన నిర్మాణం కోసం తాము గతంలో 75 రోజుల పాటు సమ్మె నిర్వహించామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రతిపక్షాలు అడ్డుపడటంతో కొత్త భవన నిర్మాణం కలగానే మిగిలిపోయిందని ఉస్మానియా దవాఖాన నర్సు హేమలత మాటలను వైద్య ఉద్యోగ సంఘాలు సమర్థించాయి. పేద ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించే ఉస్మానియా సిబ్బంది భద్రతతో విధులు నిర్వర్తించాలంటే తప్పనిసరిగా కొత్త భవనాన్ని నిర్మించాల్సిందేనని దవాఖాన ఉద్యోగులు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు. ఉస్మానియా వైద్యశాల సిబ్బందికి ఉద్యోగ సంఘాల నాయకులు బాసటగా నిలుస్తున్నారు. 

పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి సహకరించాలని టీఎన్జీవో కేంద్రసంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఎన్జీవోల బాటలోనే ఉపాధ్యాయ సంఘాల నేతలూ నూతన భవన నిర్మాణానికి మద్దతు పలికారు. ఉస్మానియా దవాఖానను వెంటనే కూల్చివేయకపోతే, దానంతట అదే కూలిపోతుందన్న వైద్య ఆరోగ్యశాఖ జేఏసీ హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గౌరి సతీశ్‌ అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఉస్మానియా దవాఖాన బాగోగుల గురించి ఏ కోశానా పట్టించుకోని రాజకీయపార్టీలు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నాయని రోగులు మండిపడుతున్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో సైతం పాత భవనాలు శిథిలమైన చోట.. నూతన భవనాలను నిర్మించారని ఉస్మానియా డాక్టర్లు గుర్తుచేస్తున్నారు. 

కొత్త భవనంతో కొత్త పుంతలు

అవయవ మార్పిడికి సంబంధించిన సౌకర్యం ఉస్మానియాలో కల్పించాలంటే.. నూతన భవన నిర్మాణం.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి అని అంటున్నారు. ఉస్మానియా దవాఖానలో ఇప్పటికే ప్రపంచస్థాయి ప్రమాణాలతో వైద్య చికిత్స అమలవుతున్నది. మరింత మెరుగైన సేవలు.. విస్తృతమైన పరిశోధన.. మరిన్ని వైద్య విభాగాలను అందుబాటులోకి తీసుకొని రావాలంటే కొత్త భవనం తప్పనిసరి.. ప్రస్తుతమున్న విభాగాలను కొనసాగించాల న్నా.. ఇప్పుడున్న స్థితిలో అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూల్చకపోయినప్పటికీ.. భవనం ఇంకా ఎంతోకాలం మనగలగడం అసాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారిగా కూలిపోతే.. దానివల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నూతన భవనాన్ని నిర్మించాలన్న ప్రభుత్వ సంకల్పానికి అందరూ చేయూతనివ్వాలని ఉస్మానియా వైద్యసిబ్బందితోపాటు.. సామాన్యులు సైతం కోరుతున్నారు. 

ప్రభుత్వాన్ని కోరిన టీఎన్జీవో

ఉస్మానియా జనరల్‌ దవాఖానను తిరిగి నిర్మించాలని టీఎన్జీవోల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. గురువారం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌, సహ అధ్యక్షురాలు రేచల్‌, రామినేని శ్రీనివాసరావు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌, కార్యదర్శి దేవేందర్‌ సంయుక్తంగా ప్రకటన విడుదలచేశారు. శిథిలావస్థలో ఉన్న ఉస్మానియా దవాఖాన పాతభవనం స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించాలని గతంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని, కానీ కొందరు కావాలని ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకొని కోర్డుల్లో కేసులు వేయడంతో ఆగిపోయిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి దవాఖాన కొత్త భవనానికి సహకరించాల్సిన అవసరమున్నదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఉస్మానియా దవాఖానలోకి మురుగునీరు చేరిన ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జీ చంద్రయ్య గురువారం సుమోటోగా స్వీకరించారు. 


logo