మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 00:13:02

ఉస్మానియా పాత భవనానికి తాళం

ఉస్మానియా పాత భవనానికి తాళం

  • డీఎంఈ ఆదేశాలతో భవనం ఖాళీ
  • సూపరింటెండెంట్‌ చాంబర్‌ తరలింపువైద్యసంఘాల ఆందోళన విరమణ

హైదరాబాద్‌/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చారిత్రాత్మకమైన ఉస్మానియా పాతభవనానికి తాళం పడింది. నిజాంకాలంలో నిర్మితమైన ఈ భవనం శిథిలావస్థకు చేరుకున్నది. పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి భారీగా నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాతభవనాన్ని మొత్తం ఖాళీచేసి, సీజ్‌చేయాలని తెలంగాణ వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ కే రమేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీచేశారు. పాతభవనంలో చికిత్సపొందుతున్న రోగులను ఇతరవార్డుల్లోకి తరలించాలని, అందులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని దవాఖాన సూపరింటెండెంట్‌కు సూచించారు. డీఎంఈ ఆదేశాల మేరకు భవనానికి తాళం వేసినట్టు, సూపరింటెండెంట్‌ చాంబర్‌ సహా నలుగురు విభాగాధిపతుల చాంబర్లను క్యూక్యూ, ఓపీ భవనాల్లోకి తరలించినట్టు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాండునాయక్‌ తెలిపారు. ప్రమాదకరంగా మారిన ఉస్మానియా పాతభవనాన్ని ఖాళీచేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ ప్రభుత్వ వైద్యులసంఘం అధ్యక్షుడు పుట్ల శ్రీనివాస్‌, డాక్టర్ల జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బొంగు రమేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. నాలుగురోజులుగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.

ప్రమాదపుటంచున వందేండ్ల భవనం

ఉస్మానియా దవాఖాన పాత భవనానికి వందేండ్లకుపైగా చరిత్ర ఉన్నది. గత పాలకుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా దవాఖానను సందర్శించారు. అక్కడి దుస్థితిని స్వయంగా చూసిన ఆయన.. పాతభవనాన్ని తొలగించి రెండుటవర్లతో, అధునాతన హంగులతో కొత్త భవనం నిర్మిస్తామని ప్రకటించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు, పలు సంఘాలు.. హెరిటేజ్‌ భవనం పేరిట పాతభవనాన్ని తొలగించకుండా, కొత్తదాన్ని నిర్మించకుండా కోర్టుల్లో కేసులు వేయడంతో కొత్త భవనం నిర్మాణ ప్రతిపాదన అడుగునపడిపోయింది. భవనం మరింత శిథిలావస్థకు  చేరుకోటమే కాకుండా.. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే వార్డుల్లోకి నీళ్లు చేరడంతో ఉస్మానియా దుస్థితి మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే దవాఖాన నిర్వహణ, సమస్యలపై వైద్యరోగ్యశాఖ కమిటీ వేసి రిపోర్టు కూడా సిద్ధంచేసింది. పేషెంట్లను వివిధవార్డులకు తరలించింది.


logo