సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 19:27:47

అనాథ పిల్లలకు ప్రభుత్వ హోమ్స్, గురుకులాల్లో ఆశ్రయం కల్పించాలి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

అనాథ పిల్లలకు ప్రభుత్వ హోమ్స్, గురుకులాల్లో ఆశ్రయం కల్పించాలి : మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

హైద‌రాబాద్ : అనాథ పిల్లలకు ప్రభుత్వ హోమ్స్, గురుకులాల్లో ఆశ్రయం కల్పించాల‌ని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారుల‌ను ఆదేశించారు. అనాథ ఆశ్రమాలకు పంపించే కుటుంబ పరిస్థితులు తెలుసుకోవాల‌ని.. సఖీ కేంద్రాలలో మహిళా-శిశు సంక్షేమ అధికారిని నియమించాలని పేర్కొన్నారు. మహిళలపై దాడులు జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు, దాడులు జరగకుండా చేపట్టే నివారణ చర్యలు, అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలపై శ‌నివారం కమిషనర్ దివ్య, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి మంత్రి జిల్లాల సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ... మహిళలు, శిశువుల విషయంలో ఎలాంటి దాడులు జరిగినా దోషులను వదిలే ప్రసక్తి లేదని, కఠినంగా శిక్షిస్తామన్నారు. 

 అమీన్‌పూర్ సంఘటన నేపథ్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా, బాలల సంరక్షణ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోపు తనిఖీ నివేదికను సమర్పించాలన్నారు. పంజాగుట్ట మహిళా కేసులో దోషులకు కఠిన శిక్షలు పడేలా చేయాలని చెప్పారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక అధికారి ద్వారా విచారణకు ఆదేశించిందన్నారు. వీలైనంత త్వరలోనే నివేదిక ఇవ్వడంతో పాటు దోషులకు శిక్ష పడేలా అధికారులు ఎప్పటికప్పుడు ఈ కేసును పర్యవేక్షించాలన్నారు. ఆశ్రమాలలో చేర్పించే పిల్లల విషయంలో ఆరేళ్లు దాటినవారు అయితే గురుకులాల్లో చేర్పించి సంరక్షించాలని, ఆరేళ్లలోపు వారయితే అంగన్‌వాడీల ద్వారా కావల్సిన సహకారం వారికి అందించాలని సూచించారు.

ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో స్థానిక అంగన్‌వాడీ అధికారి ఫోన్ నెంబర్‌తో పాటు 100, 108, 181 నెంబర్లు, స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారుల నెంబర్లు కూడా ప్రదర్శించాలన్నారు. దత్తత తీసుకునే అంశంపై కూడా విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. చాలామంది దీనిపై అవగాహన లేకుండా దత్తత కోరుతున్నారన్నారు. కొంతమంది దత్తత తీసుకుని పిల్లలను సరిగా చూసుకోవడం లేదని అందుకోసం దత్తత ఇచ్చేటప్పుడు తీసుకునే వారిపై సమగ్ర విచారణ చేయాల‌న్నారు. మహిళా – శిశు సంక్షేమశాఖ పరిధిలోని ప్రతి చోట మహిళలు, శిశువుల సంరక్షణకు తామున్నామనే భరోసా ఇచ్చే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.


తాజావార్తలు


logo