మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:14:49

నాడు తల్లి.. నేడు తండ్రి

నాడు తల్లి.. నేడు తండ్రి

  • తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు 
  • ఆదుకుంటామని మంత్రి కేటీఆర్‌ భరోసా

మోటకొండూర్‌: ఏడాది క్రితం తల్లి.. బుధవారం రాత్రి తండ్రి మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరులో చోటుచేసుకున్నది. విషయం తెలుసుకున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదుకుంటామని భరోసా కల్పించారు. వివరాలుఇలా.. మాటూరు గ్రామానికి చెందిన బైరపాక నవీన్‌, రేణుక దంపతులు. వీరికి ఇద్దరు సంతానం కూతురు అస్మిక(9), కుమారుడు హర్ష(7). జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు.. నవీన్‌ పెయింటింగ్‌ పని, రేణుక కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఏడాది క్రితం రేణుక (29) అనారోగ్యంతో మృతిచెందింది. బుధవారం రాత్రి నవీన్‌కు గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందాడు. తల్లిదండ్రులు మరణించడంతో చిన్నారులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ట్విట్టర్‌లో స్పందించిన మంత్రి కేటీఆర్‌

తల్లిదండ్రుల మృతితో చిన్నారులు అనాథలయ్యారనే విషయాన్ని మాటూరు గ్రామానికి చెందిన యువకుడు ట్విట్టర్‌ ద్వారా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు సమాచారమిచ్చాడు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. వారి పూర్తి వివరాలు పంపాలని సందేశం పంపారు. చిన్నారుల బంధువులు ఒప్పుకుంటే వారి పూర్తి బాధ్యత తీసుకొని చదివిస్తానని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత ప్రకటించారు.


logo