బుధవారం 27 మే 2020
Telangana - May 16, 2020 , 20:07:24

అనాథ చిన్నారులకు కేటీఆర్‌ భరోసా

అనాథ చిన్నారులకు కేటీఆర్‌ భరోసా

నల్లగొండ: ఎప్పుడూ ట్విట్టర్‌లో అందుబాటులో ఉండే మంత్రి కే తారకరామారావు.. బాధితులకు అండగా నిలుస్తూ వారికి తగిన సహాయం అందిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ, తాతయ్య వద్ద పెరుగుతున్న మర్రిగూడ మండలం  పరిధిలోని లంకలపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లకు ‘మేమున్నాం’ అని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావిస్తూ అరుణ్‌సాగర్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టుచేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించి వారి సంరక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఏర్పుల అజయ్‌, అంజలిని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 

మంత్రి కేటీఆర్‌ కార్యాలయం నుంచి బాధితుల వివరాలు సేకరించారు. శనివారం గ్రామానికి వెళ్లిన ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మ.. గ్రామస్థుల నుంచి చిన్నారుల పూర్తివివరాలను నమోదు చేసుకున్నారు. మొదటగా చిన్నారుల సంరక్షణ చర్యలు చేపడుతామన్నారు.  ప్రస్తుతం వారిని బాలసంరక్షణ కేంద్రానికి తరలిస్తామని కలెక్టర్‌ తెలిపారు. అజయ్‌ ప్రస్తుతం భీమనపల్లిలో ఎనిమిదో తరగతి చదువుతుండగా.. ఆయన చెల్లి అంజలి లంకెలపల్లిలోనే ఆరో తరగతి చదువుతున్నది.


logo