సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:40

భగీరథ దిక్సూచి

భగీరథ దిక్సూచి

 • తెలంగాణకు సాంకేతిక బృందాలను పంపండి
 • నీటి సరఫరాలో ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ వ్యవస్థ
 • ఆ సాంకేతికతను మీరూ అందిపుచ్చుకోండి
 • అన్ని రాష్ర్టాలకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ లేఖ
 • జల్‌జీవన్‌ మిషన్‌లో భగీరథను అనుసరించాలన్న కేంద్ర ప్రభుత్వం
 • నీటి సరఫరాలో ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ భేష్‌ 
 • ఈ విధానాన్ని పరిశీలించాలని అన్ని రాష్ర్టాలకు లేఖ రాసిన డైరెక్టర్‌

ఇదీ తెలంగాణ. ఇదే తెలంగాణ. దేశానికి మార్గదర్శిగా నిలిచే తెలంగాణ. ప్రతిష్ఠాత్మక పథకాలు, ప్రాజెక్టులను చేపడుతూ దూసుకుపోతున్న రాష్ట్రం.. మరోసారి మిషన్‌ భగీరథ రూపంలో దేశానికి ఆదర్శంగా, మార్గదర్శిగా నిలిచింది. మిషన్‌ భగీరథను చూసి రావాలని కేంద్రమే అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది. దాని సాంకేతికతను వాడుకోవాలని సూచించింది.

మూడేండ్లలోనే పూర్తయిన అతిపెద్ద  పథకం

 • సార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 
 • హుడ్కో అవార్డు లభించింది.
 • గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికి రోజుకు సగటున 100 లీటర్లు, మున్సిపాలిటీల్లో 
 • 135 లీటర్లు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో 150 లీటర్ల సరఫరా
 • మిషన్‌ భగీరథ సమగ్ర స్వరూపం
 • ప్రాజెక్టు వ్యయం 45,028 కోట్లు
 • 2.72 కోట్ల  ప్రజలు,65.29 లక్షల ఇండ్లకు శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్నది.
 • 98%నీటి సరఫరా గ్రావిటీ ఆధారంగానే నడుస్తుంది. 
 • 24,225 గ్రామాలు, పల్లెలకు రక్షితనీటి సరఫరా
 • 2019లో 59.94 టీఎంసీలు, 2048 నాటికి 86.11 టీఎంసీల నీటి సరఫరా
 • 1.46 లక్షల కిలోమీటర్లపైపులైన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఇంటింటికీ గుక్కెడు తాగునీళ్లు అందించాలన్న గొప్ప సంకల్పమే.. మిషన్‌ భగీరథ. ఈ మహత్తర ప్రాజెక్టు మొదలుపెడుతుంటే ప్రతిపక్షాలు కమీషన్‌ భగీరథ అని ఎద్దేవా చేశాయి. పనుల్లో నాణ్యత లేదని ఆరోపించాయి. శాశ్వత సమస్యను తీర్చేందుకు పకడ్బందీగా పనులు చేపడితే ఇంకెప్పుడు పూర్తవుతుందంటూ విమర్శలు గుప్పించాయి. పల్లెపల్లెకు స్వచ్ఛమైన తాగునీరు చేరాలని లక్షల కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తుంటే పైపులు అమ్ముకున్నారని బద్నాం చేసే ప్రయత్నం చేశాయి. ఎవరెన్ని తిట్టినా, నీలాపనిందలు మోపినా.. రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ముందు అవన్నీ బలాదూరేనని మరోసారి రుజువైంది. ‘తెలంగాణకు వెళ్లి మిషన్‌ భగీరథను చూసి రండి’ అంటూ కేంద్రం చేసిన సూచనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. అవును..! జల్‌శక్తి మంత్రిత్వశాఖే స్వయంగా అన్ని రాష్ర్టాలకు లేఖ రాసి మిషన్‌ భగీరథలో అవలంభిస్తున్న సాంకేతికతను వాడాలని సూచించింది. 2024 నాటికి దేశంలోని ఇంటింటికీ తాగునీరందించాలన్న లక్ష్యంతో కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా ఇంటింటికీ రోజుకు 55 లీటర్ల మంచినీటిని అందించాలని లక్ష్యంగా పెట్టకున్నది. ఈ నేపథ్యంలో నీటి సరఫరాలో తెలంగాణలో మిషన్‌ భగీరథ వాడుతున్న సాంకేతికతను చూసి కేంద్రం ముచ్చటపడింది. అదే.. ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథతో ఈ సాంకేతికతను వాడుతున్నది.

ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ ప్రత్యేకత ఏంటి?

ప్రధాన పైప్‌లైన్‌ నుంచి ఇంటికి వెళ్లే కనెక్షన్‌ వద్ద ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ను బిగిస్తారు. దీనిద్వారా నిమిషానికి కేవలం ఐదు లీటర్ల నీరు మాత్రమే వెళ్తుంది. ఎక్కువ నీళ్లు వెళ్లకుండా నీటి సరఫరాను నియంత్రిస్తుంది. ఒకవేళ ఎక్కువ నీళ్లు వచ్చేలా నల్లాకు మోటరు బిగించినా ఒక్క చుక్కబొట్టును కూడా అదనంగా లాక్కోలేరు. అంటే.. మోటర్ల ద్వారా ఎక్కువ నీటిని పొందడం అసాధ్యం. ప్రతి ఇంటికి సమాన స్థాయిలో నీరు సరఫరా అవుతుంది.

రాష్ర్టాలకు కేంద్రం ఏం చెప్పిదంటే..

తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరాకు అవలంభిస్తున్న విధానం అన్ని రాష్ర్టాలకు మార్గదర్శిగా నిలుస్తున్నదని జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ సాహో లేఖలో పేర్కొన్నారు. ‘ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌లో ఫ్లో కంట్రోల్‌ వాల్వ్‌ను వాడాలి. నీటిని అదనంగా వాడుకోవాలనుకున్నా సాధ్యం కాకుండా ఫ్లో కంట్రోల్‌ వ్యవస్థ పనిచేస్తుంది. తెలంగాణ మోడల్‌ను అధ్యయనం చేయడానికి సాంకేతిక బృందాలను ఆ రాష్ర్టానికి పంపండి’ అని వివరించారు. ఈ తరహా సాంకేతికతను అన్ని రాష్ర్టాలు అవలంభించాలని సూచించారు.

అందుకే దేశవ్యాప్త ప్రశంసలు..

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందించాలన్న సీఎం కేసీఆర్‌ సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పంతోనే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు వేల కోట్లు ఖర్చుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అనతి కాలంలోనే ఈ ప్రాజెక్టు దేశవ్యాప్త ప్రశంసలు అందుకుంటున్నది. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఒడిశా నుంచి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును పరిశీలించి వెళ్లారు. చూసిన ప్రతీఒక్కరు ఇదొక ఇంజినీరింగ్‌ అద్భుతమంటూ కొనియాడారు. ఈ పథకానికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం హుడ్కో అవార్డు కూడా అందజేసింది. లభించింది. ప్రధాని మోదీ, నీతి ఆయోగ్‌, 15వ ఆర్థిక సంఘం కూడా పథకాన్ని ప్రశంసించాయి.

దేశానికే ఆదర్శంగా మిషన్‌ భగీరథ: కల్వకుంట్ల కవిత

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రిక మిషన్‌ భగీరథ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అధునాతన సాంకేతికతను పరిశీలించాలని జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌ డైరెక్టర్‌ అన్ని రాష్ర్టాలకు లేఖ రాయడం గర్వకారణమని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.logo