శనివారం 04 జూలై 2020
Telangana - Apr 12, 2020 , 02:02:39

అమెరికాపై.. ‘ఒరిజినల్‌' కరోనా పంజా

అమెరికాపై.. ‘ఒరిజినల్‌' కరోనా పంజా

  • ఏ,బీ,సీ వర్గాలుగా వైరస్‌ గుర్తింపు
  • ఎక్కువ నష్టం చేస్తున్నది మొదటి రకమే 
  • కేంబ్రిడ్జ్‌ పరిశోధకుల వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా విశ్వమారి అగ్రరాజ్యం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. మిగిలిన దేశాలతో పోలిస్తే వైరస్‌ కారణంగా అక్కడి ప్రజలు పెద్దమొత్తంలో మృత్యువాత పడుతున్నారు. దీంతో అమెరికాపై కరోనా ఎందుకు తీవ్రంగా విరుచుకుపడుతున్నదన్న దానిపై కేంబ్రిడ్జ్‌కి చెందిన నిపుణులు పరిశోధనలు చేశారు. ప్రజల రోగ నిరోధక శక్తిని ఎదుర్కొనేందుకు ఈ మహమ్మారి నిరంతరం పరివర్తన చెందుతున్నట్టు ఆ పరిశోధనల్లో గుర్తించారు. ఇందులో భాగంగా వైరస్‌ ఇప్పటి వరకు మూడు రూపాల్లోకి మారిందన్నారు. వీటిని ఏ,బీ,సీ వర్గాలుగా విభజించినట్టు చెప్పారు. చైనాలో పుట్టిన కరోనా ‘ఏ’ రకానికి చెందిన వైరస్‌ ఆనవాళ్లు అమెరికాలో ఉన్నట్టు పేర్కొన్నారు. దీని కారణంగానే అమెరికాపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. వారి విశ్లేషణ ప్రకారం.. ‘ఏ’ రకానికి చెందిన వైరస్‌ మొదట గబ్బిలాల నుంచి మనిషికి సంక్రమించింది. 

ఇది తొలిరకం వైరస్‌. చైనాలోని వుహాన్‌తో పాటు, అమెరికా, ఆస్ట్రేలియాలో ఈ రకం వైరస్‌ కనిపిస్తున్నది. జన్యు మార్పుల కారణంగా ‘ఏ’ రకం నుంచి ‘బీ’ రకం వైరస్‌ పరివర్తన చెందిందని, ఈ వైరస్‌ కెనడా, బ్రెజిల్‌, బ్రిటన్‌, ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, బెల్జియం, స్పెయిన్‌, ఫ్రాన్స్‌పై ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు. ఇక ‘బీ’ వైరస్‌ నుంచి ‘సీ’ రకానికి చెందిన వైరస్‌ ఉద్భవించిందని, ‘బీ’కి కూతురుగా చెప్పే ఈ వైరస్‌ సింగపూర్‌, హాంకాంగ్‌, దక్షిణ కొరియాలో ఎక్కువగా కనిపిస్తున్నదని వెల్లడించారు. అయితే ‘ఏ’ రకానికి చెందిన వైరస్‌ జన్యుక్రమంతో ‘సీ’ రకానికి చెందిన ఈ వైరస్‌కు ఎలాంటి పోలికలు లేవన్నారు. 

40 నుంచి 70 శాతం మరణాలు వారివే

అమెరికాలో కరోనాతో మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం నల్లజాతీయులే ఉంటున్నారు. దేశ జనాభాలో వీరు 13 శాతమే ఉన్నప్పటికీ, మొత్తం కరోనా మరణాల్లో మాత్రం దాదాపు 40 - 70% వీరే ఉంటున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నల్లజాతి వారిలో ఎక్కువమందికి మధుమేహం, గుండెజబ్బులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉండడంమే ఇందుకు ప్రధాన కారణమని వైద్యులు తెలిపారు. అలాగే ఆర్థిక, సామాజిక కారణాలు, ఆహార అలవాట్లు కూడా మరణాలకు మరో కారణమని చెప్పారు.

యూరప్‌ నుంచే కరోనా..

యూరప్‌ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారానే కరోనా వైరస్‌ న్యూయార్క్‌కు వ్యాపించిందని, ఆసియా దేశాల నుంచి కాదని అమెరికాలోని ఎన్‌వైయూ గ్రాస్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌, ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ అధ్యయనంలో తేలింది. 

 న్యూయార్క్‌పైనే తీవ్రత ఎందుకు?

కరోనాతో అమెరికాలో సంభవించిన మొత్తం మరణాల్లో దాదాపు 41% న్యూయార్క్‌లోనే నమోదయ్యాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల్లో న్యూయార్క్‌ ఒకటని, నగరంలో చదరపు కి.మీ.కు సగటున పది వేల మంది వరకు నివసించడం వల్ల వైరస్‌ సులభంగా వ్యాపించిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండ్య్రూ క్యూమో తెలిపారు. దీంతోపాటు అమెరికా సందర్శనకు వచ్చే పర్యటకులు న్యూయార్క్‌లోనే మొదట దిగుతారని, దీంతో వైరస్‌ వ్యాపిస్తే ముందుగా ప్రభావితం అయ్యేది న్యూయార్క్‌ నగరమేనని చెప్పారు. 


logo