ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 02:46:32

ఏపీ అక్రమాలతో తాగునీటికీ ముప్పే

ఏపీ అక్రమాలతో తాగునీటికీ ముప్పే

  • శ్రీశైలం జలాల్ని మళ్లించే వివిధ పనులకు జీవోలు
  • ఎన్జీటీకి అదనపు డాక్యుమెంట్లు సమర్పించిన తెలంగాణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తాగునీటికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) దృష్టికి తీసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌ శ్రీశైలం జలాల్ని మళ్లించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో విచారణ కొనసాగుతుండగానే.. ఏపీ ప్రభుత్వం మరిన్ని విస్తరణ పనులకు అనుమతిస్తూ ఎడాపెడా జీవోలు జారీచేస్తున్నదని పేర్కొన్నది. ఈ మేరకు ఎన్జీటీకి పలు డాక్యుమెంట్లను సమర్పించింది. కొంతకాలంగా రాయలసీమ ఎత్తిపోతలపై ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌కు ట్రిబ్యునల్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. తుది తీర్పు వస్తుందనుకున్న తరుణంలో తెలంగాణ అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకొని ట్రిబ్యునల్‌ విచారణను మళ్లీ కొనసాగించింది. 

ఈ నెల 3న ట్రిబ్యునల్‌ తీర్పును రిజర్వుచేయడంతోపాటు లిఖితపూర్వక అభిప్రాయాల్ని ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్‌కు అవకాశం కల్పించింది. విచారణ సందర్భంగానే తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కొత్త విషయాలను ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకువెళ్లింది. శ్రీశైలం జలాల్ని పెన్నా బేసిన్‌లో తరలించేందుకు గత నెల 26న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీచేసిన జీవోలను ట్రిబ్యునల్‌కు సమర్పించింది. గండికోట-చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు జలాల్ని తరలించేందుకు లిఫ్టు స్కీం, గండికోట నుంచి పైడిపాలెం లిఫ్టు విస్తరణ, అప్‌గ్రేడ్‌ కోసం రూ.3,556.76 కోట్లతో పాలనా అనుమతిచ్చింది. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎర్రబెల్లి ట్యాంకు, అక్కడ నుంచి గడ్డంగివారిపల్లె రిజర్వాయర్‌కు జలాల తరలింపు, 1.20 టీఎంసీలతో కొత్తగా గడ్డంగివారిపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి రూ.1,113 కోట్లతో పాలనా అనుమతిస్తూ ఏపీ సర్కారు జీవో జారీచేసింది. 

గాలేరు నగరి నుంచి పదివేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో గండికోట టన్నెల్‌ నిర్మాణం, ఇతర కాల్వల నిర్మాణాన్ని రూ.604.80 కోట్లతో చేపట్టేందుకు పాలనా అనుమతిచ్చింది. రూ.5,036 కోట్లతో గాలేరు నగరి నుంచి హంద్రీనీవాకు లిఫ్టు స్కీం, అదినిమ్మాయపల్లి ఆనకట్ట దిగువన పుష్పగిరి ఆలయం సమీపంలో ఒక్క టీఎంసీ నిల్వతో బరాజ్‌ నిర్మాణానికి సర్వేకోసం రూ.35.50 కోట్లకు పాలనా అనుమతులిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసింది. వీటన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్‌కు సమర్పించింది. మరోవైపు, ఉమ్మడి ఏపీలోనే హైదరాబాద్‌ మహానగరానికి తాగునీటిని కేటాయిస్తూ 2003లో ఇచ్చిన జీవోతోపాటు తాగునీటి కోసం మిషన్‌ భగీరథ కింద చేసిన కేటాయింపుల జీవోను కూడా ట్రిబ్యునల్‌కు అందజేసింది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి భారీఎత్తున కృష్ణాజలాల్ని తరలించడం వల్ల చివరకు తాగునీటికి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని దృష్టికి తీసుకెళ్లింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు త్వరలో మరోసారి లిఖితపూర్వక అభిప్రాయాల్ని సమర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.


logo