మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 01:02:41

దేశదేశాల్లోనరసింహ నాదం

దేశదేశాల్లోనరసింహ నాదం

  • ప్రపంచవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలు
  • 51 దేశాల ఎన్నారైల సమావేశంలో కేటీఆర్‌
  • ఉత్సవ కమిటీ సభ్యుడిగా మహేశ్‌ బిగాల

జ్ఞానభూమిలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తెలుగు ప్రజల ఖ్యాతి ఖండాంతరాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీ నరసింహారావుకు రావాల్సిన పేరు రాలేదు. ఆయనకు భారతరత్న దక్కాల్సిన అవసరం ఉన్నది. ఈ నెల 28 నుంచి పీవీ జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నారైలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. 

- మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. శుక్రవారం 51 దేశాల్లోని ఎన్నారైలతో ప్రగతిభవన్‌ నుంచి ఆయన వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు పీవీ నరసింహారావు, ఈశ్వరీబాయి, వెంకటస్వామి లాంటి వారిని పార్టీలకు అతీతంగా స్మరించుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని వివరించారు. వీరితోపాటు జయశంకర్‌, పీవీ నరసింహారావు, కుమ్రంభీం లాంటి మహానీయుల పేర్లను యూనివర్సిటీలు, జిల్లాలకు పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతి ఖండాంతరాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పీవీకి రావాల్సిన పేరు రాలేదని, ఆయనకు భారతరత్న దక్కాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఈ నెల 28 నుంచి పీవీ జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎన్నారైలంతా పాల్గొనాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఇందుకోసం తెలంగాణ సంఘాలతో పాటు మిగిలిన తెలుగు సంఘాలతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాలను శతజయంతి ఉత్సవాల కమిటీలో సభ్యుడిగా చేర్చుతున్నట్టు మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. 

జ్ఞానభూమి సందర్శన

ఆదివారం నిర్వహించే పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెక్లెస్‌రోడ్డులోని పీవీ సమాధి జ్ఞానభూమి వద్ద ఏర్పాట్లను హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఎలాంటి లోటు రాకుండా ఉత్సవాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

పీవీ జ్ఞానభూమి ముస్తాబు

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ జ్ఞానభూమిని ప్రభుత్వ యంత్రాంగం సుందరంగా ముస్తాబు చేస్తున్నది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్‌ పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో పీవీ శత జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవానికి వీవీఐపీలు, వీఐపీలు, ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు పెద్దఎత్తున హాజరుకానున్నారు. పీవీ ఘాట్‌ చుట్టూ పుష్పాలంకరణ, లైట్లు, షామియానాలు ఏర్పాటుచేస్తున్నారు. సర్వమత ప్రార్థనలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, సాంస్కృతిక, వైద్యారోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

పీవీ ఘాట్‌ విశేషాలు..

హుస్సేన్‌సాగర్‌ తీరంలోని నెక్లెస్‌రోడ్డులో.. సంజీవయ్య పార్క్‌ సమీపంలో పీవీ జ్ఞానభూమిని 2005లో 2.9 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. అందులో ఆయన స్మారకార్థం ఘాట్‌ నిర్మించారు. ప్రవేశద్వారం వద్ద ఆరు శిల్పాలను ఏర్పాటు చేశారు. ఘాట్‌ చుట్టూ గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్‌ను అభివృద్ధి చేయగా నిర్వహణ బాధ్యతను హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తున్నది. 


logo