బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 05:05:50

మన సోనా

మన సోనా
  • తెలంగాణ సోనా రకం షుగర్‌ పేషెంట్లకు అనుకూలం
  • ధ్రువీకరిం చిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌
  • దేశంలోని ఏడు రాష్ర్టాల్లో ఈ విత్తనానికి భారీ డిమాండ్‌
  • ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ జర్నల్‌లోనూ ఈ వంగడంపై ప్రత్యేక కథనం
  • ప్రభుత్వ చొరవతో వ్యవసాయరంగానికి భారీ మేలు
  • జయశంకర్‌ వర్సిటీకి జాతీయ స్థాయిలో మూడోస్థానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైస్‌ రిసెర్చ్‌ సెంటర్‌ సృష్టించిన ‘తెలంగాణ సోనా’ వరి వంగడం పేరుకు తగ్గట్టుగానే నిజంగా బంగారమే. టైప్‌-2 మధుమేహంతో బాధపడే వారికి వరంగా మారింది. సాధారణ బియ్యం కంటే భిన్నంగా జొన్నలు, సజ్జలు వంటి చిరు ధాన్యాల్లో ఉండేస్థాయిలోనే కార్బోహైడ్రేట్స్‌ ఉండటం దీని ప్రత్యేకత. ఈ తెలంగాణ సోనా వరి వంగడాన్ని హైదరాబాద్‌ తార్నాకలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) సంస్థ కూడా పరిశోధించి ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో ఈ వంగడం దేశంలోని దాదాపు ఏడు రాష్ర్టాల రైతుల ఆదరణ పొందింది. తెలంగాణ సోనా వరి వంగడం లైసెన్స్‌ కోసం ఇతర రాష్ర్టాల వరి విత్తన వ్యాపారులు జయశంకర్‌ వర్సిటీని ఆశ్రయిస్తున్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ఈ వంగడానికి అంతర్జాతీయస్థాయిలోనూ గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక అమెరికన్‌ జర్నల్‌లోనూ దీనిపై కథనం ప్రచురితమైంది. ఆవిర్భవించిన అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదనడానికి దీనిని కూడా ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ జాతీయస్థాయిలో 27వ స్థానంలో ఉండగా, స్వరాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రస్తుతం మూడో స్థానంలో, దక్షిణ భారత్‌లో మొదటిస్థానంలో నిలిచింది.


‘తెలంగాణ సోనా వరి’ ప్రత్యేకతలు

ఈ తెలంగాణ సోనా వరి వంగడం ప్రత్యేకతను సీఎం కేసీఆర్‌ కూడా ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇది తక్కువ కార్బోహైడ్రేట్స్‌ ఉండి టైప్‌- 2 షుగర్‌ పేషెట్లకు అనుకూలం. గ్లూకోజ్‌ శాతం కేవలం 51.6 మాత్రమే ఉండటం వల్ల తెలంగాణ సోనా వరి అన్నం తినేవారికి షుగర్‌ వచ్చే అవకాశాలుండవు. ఇతర వరి వంగడాల్లో గ్లూకోజ్‌ శాతం 55నుంచి 62వరకు ఉంటుంది. సాంబా మసూరి వంటి పంట పండించడానికి 155 నుంచి 160 రోజుల సమయం పడితే, తెలంగాణ సోనాకు కేవలం 125 రోజులు సరిపోతుంది. దిగుబడి కూడా ఇతర వంగడాల కంటే 5నుంచి 10శాతం ఎక్కువ రావడం విశేషం. సాంబా మసూ రి ఎకరానికి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తే, తెలంగాణ సోనా 28 క్వింటాళ్ల వరకువస్తుం ది. ఈ వరి వంగడాన్ని రెండు సీజన్లలో పండించుకోవచ్చు. తక్కువ రోజుల్లో దిగుబడి రావడం వల్ల పంటకు పంటకు మధ్యలో జనుము, పిల్లి పెసర, పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల భూమి సారవంతమవుతుంది. ఎరువుల వినియోగం, ఖర్చు కూడా తగ్గుతుంది.


పథకాల అమలుతోనే అద్భుత ఫలితాలు

కేసీఆర్‌ వంటి నేత ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో తెలంగాణ సోనా వరి వంగడం సృష్టిస్తున్న అద్భుత ఫలితాలే నిదర్శనం. తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 225 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చినా ఇబ్బంది లేదని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, సుమారు రెండు లక్షల కోట్ల ప్రణాళికతో సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్న సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వల్లే తెలంగాణ వ్యవసాయరంగం అద్భుత ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నది. రానున్న రోజుల్లో తెలంగాణ వ్యవసాయరంగం ఇంకా విప్లవాత్మక మార్పులతో చరిత్ర సృష్టించే అవకాశాలున్నాయి.


logo
>>>>>>