శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 02:08:16

సేంద్రియ సాగు బాగు

సేంద్రియ సాగు బాగు

  • ఆసక్తి చూపుతున్న స్తంభాద్రి రైతులు
  • స్వతహాగా వర్మీకంపోస్టు,జీవామృతం తయారీ
  • తగ్గుతున్న రసాయన ఎరువుల వాడకం
  • ఖమ్మం జిల్లాలో 2,450 ఎకరాల్లో సాగు

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: స్తంభాద్రి రైతులు  సేంద్రియసాగు వైపు అడుగులు వేస్తున్నారు. తక్కువఖర్చుతో ఎక్కువ లా భాలు వస్తుండడంతో జిల్లా రైతులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఎవరికివారే స్వతహాగా వర్మీకంపోస్టు, జీవామృతం తయారు చేసుకుంటున్నారు. దీంతో రసాయన ఎరువుల వినియోగం తగ్గుతున్నది. గత నాలుగేండ్లలో జిల్లాలో దాదాపు 2,450 ఎకరాల్లో రైతులు సేంద్రియసాగు చేపట్టారు. 

వ్యవసాయశాఖ ప్రోత్సాహం

వ్యవసాయంలో నష్టాలను తగ్గించే దిశగా వ్యవసాయశాఖ రైతులను సేంద్రియ సాగుకు పోత్సహిస్తున్నది. తొలుత జిల్లా వ్యవసాయశాఖ కిసాన్‌ యోజన పథకంలో భాగంగా 16 క్లస్టర్లను ఏర్పాటుచేసి ఆసక్తి కలిగిన రైతులను గుర్తించింది. వీరిద్వారా 800 ఎకరాల్లో సేంద్రియ సాగు చేయించారు. 2018-19లో 21 మండలాల పరిధిలో ప్రతి 50 ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి 1,600 ఎకరాల్లో వరి, ఆపరాలు, ఉద్యాన పంటలను సాగు చేయించారు. ఎప్పటికప్పుడు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూనే ఉచితంగా బయో ఫెస్టిసైడ్స్‌, బయో ఫెర్టిలైజర్స్‌తోపాటు వర్మీకంపోస్టు తయారికి అవసరమైన పరికరాలను అందించారు.  ఈ పద్ధతిలో సాగు  ద్వారా  నాలుగేండ్ల నుంచి యూరియా వాడకం  తగ్గింది.  

స్థానికంగా వర్మీకంపోస్టు తయారీ.. 

ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో కొందరు రైతులు సేంద్రి య పద్ధతిలో పంటలు సాగు చేపడుతున్నారు. సదరు రైతులు సొంతంగా వర్మీకంపోస్టు, జీవామృతంలాంటి ఎరువులను తయారుచేస్తున్నారు. వారి అవసరాలుపోను జిల్లాతోపాటు పొరుగున ఉన్న సూర్యాపేట, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు ఎరువులను ఎగుమతి చేస్తున్నారు.


సేంద్రియ పద్ధతితో బహుళ ప్రయోజనాలు

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చు.ఈ విధానం రైతుకు, భూమికి, పర్యావరణ పరిరక్షణకు దోహ దం చేస్తుంది. పచ్చిరొట్ట, ఆవుపేడతో భూసారం పెరుగుతుంది. తొలిదశలో కొంతమేర దిగుబడి తగ్గినా మరుసటి ఏడాది నుంచి మంచి ఫలితాలుంటాయి. 

- డాక్టర్‌ హేమంత్‌కుమార్‌, కో- ఆర్డినేటర్‌, వైరా కృషీ విజ్ఞాన కేంద్రం

18 ఏండ్లుగా సేంద్రియ సాగే..

18 ఏండ్లుగా 15 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నా.సొంతంగా  వర్మీ కంపోస్టు ఎరువుతోపాటు జీవామృతం తయారు చేస్తున్నాం. నా అవసరాలు పోను జిల్లా రైతులతో పాటు ఇతర జిల్లాల రైతులకు విక్రయిస్తున్నాను. మేము పండించిన బియ్యానికి మంచి డిమాండ్‌ ఉంది.

- అనుమోలు రామిరెడ్డి, ముత్తగూడెం, ఖమ్మం రూరల్‌


logo