గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jun 01, 2020 , 01:42:17

ఎకరంన్నరలో 16 లక్షల ఆదాయం

ఎకరంన్నరలో 16 లక్షల ఆదాయం

  • 24 రకాల కూరగాయలు, పూల తోటలు
  • కాసులు కురిపిస్తున్న సేంద్రియ సాగు
  • ఎవుసంలో రాణిస్తున్న నారాయణపేట యువరైతు

ఎవుసంలో మూస పద్ధతికి రైతులు స్వస్తి పలుకుతున్నారు. కాలానికి అనుగుణంగా సంపదనెరిగి సాగు చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండి, తక్కువ భూమిలో అధిక దిగుబడులను ఇచ్చే పంటలను ఎంచుకుంటూ శ్రమకు తగిన ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోవలోనే నారాయపేట జిల్లా కేంద్రానికి చెందిన యువరైతు గట్టు అనిల్‌ ఎకరంన్నర భూమిలో సేంద్రియ విధానంలో 24 రకాల కూరగాయలు, పూల తోటలు సాగుచేస్తూ ఏటా రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల లాభాలు పొందుతూ ఉత్తమ రైతుగా రాణిస్తున్నారు.

నారాయణపేట, నమస్తే తెలంగాణ: నారాయణపేటకు చెందిన గట్టు అనిల్‌ ఎం సీఏ, ఎమ్మెస్సీ (మాథ్స్‌), ఎమ్మెస్సీ (సైకాలజీ), కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ, బీఈడీ చదివారు. 2012లో బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సాధించారు. తన రెండేండ్ల వయస్సులోనే తండ్రి చనిపోగా, తల్లి అంజమ్మ కష్టపడి చదివించింది. తల్లిని ఒంటరిగా వదిలేసి బెంగళూరుకు వెళ్లలేక ఉద్యోగాన్ని వదులుకున్నారు. తర్వాత వ్యవసాయంపై దృష్టి సాచించారు. తనకున్న 7 ఎకరాల్లో బోరు బావిని తవ్వించారు. మొదట కందులు, జొన్న సాగుచేశారు. ఆశించిన మేర ఫలితం రాకపోవడంతో కూరగాయలు, పూలతో టల పెంపకం వైపు మొగ్గు చూపారు. ఉన్న నీటివనరులకు అనుగుణంగా ఎకరంన్నర భూమిలో సేంద్రియ సాగుచేస్తున్నారు.

24 రకాల కూరగాయలు

రైతు అనిల్‌ ఏడాది పొడవునా కూరగాయలు సాగుచేస్తున్నారు. కేవలం సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడి వచ్చే బీర, కాకర, సోర, దొండ, పొట్ల, టమాట, పచ్చిమిర్చి, చిక్కుడు, గోరుచిక్కుడు, గుమ్మడి, మునగ, వంకాయ, పాలకూర, మెంతి కూర, పుంటికూర, కొత్తిమీర, పుదీన, ముల్లంగి, క్యారెట్‌ వంటి కూరగాయలతోపాటు శుభకార్యాల్లో ఉపయోగించే బంతిపూలు, జర్మనీపూలు సాగుచేస్తున్నారు. అడవి జంతువుల నుంచి పంటల రక్షణ కోసం గాలితో మోగే బెల్‌ను రూపొందించారు.

తోట వద్ద నుంచే కొనుగోళ్లు

జిల్లా కేంద్రానికి సమీపంలో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగుచేస్తుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు తోట వద్దకే వస్తున్నారు. అలా అమ్ముడుపోగా మిగిలిన వాటిని ఇంటి వద్ద ఉంచి విక్రయిస్తున్నారు. ప్రతిరోజు కూరగాయల విక్రయాల ద్వారా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు లాభాలు గడిస్తున్నారు. పూల అమ్మకాల ద్వారా కూడా మంచి ఆదాయం వస్తున్నది. ఏడాదిలో అన్ని ఖర్చులు పోగా రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల లాభం వస్తున్నదని అనిల్‌ తెలిపారు.


మంచి లాభాలు వస్తున్నాయి

కూరగాయలు, పూల తోటల సాగులో మంచి పట్టు సాధించా. ఇప్పుడు జిల్లా కేంద్రంలో చాలామంది నేను పండించిన కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. మంచి లాభాలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. రసాయన, క్రిమిసంహారక మందులతో ప్రమేయం లేకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించి జిల్లావ్యాప్తంగా విక్రయించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. చదువు వృథా కాకూడదని జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నా. ఈ ఏడాది నుంచి సాగు విస్తీర్ణం పెంచుత.

- గట్టు అనిల్‌, యువ రైతు, నారాయణపేట

VIDEOS

logo