శనివారం 11 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:40:39

వేతనాల వాయిదాపై ఆర్డినెన్స్‌

వేతనాల వాయిదాపై ఆర్డినెన్స్‌

  • సగానికి మించకుండా వేతనాలు, పింఛన్‌ చెల్లింపులు వాయిదావేసే అవకాశం
  • గవర్నర్‌ ఆమోదంతో గెజిట్‌ విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల సొమ్ములో సగానికి మించకుండా చెల్లింపులను కొంతకాలం వాయిదావేసేందుకు వీలు కల్పించే తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌ను రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలతోపాటు, వ్యక్తులు, సంస్థలకు చెల్లించాల్సిన మొత్తాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం గవర్నర్‌ ఆమోదంతో ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొవచ్చింది. గవర్నర్‌ సౌందర్‌రాజన్‌ ఆమోదంతో మంగళవారం రాత్రి న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి గెజిట్‌ను విడుదలచేశారు. ఈ ఆర్డినెన్స్‌ ఈ ఏడాది మార్చి 24వ తేదీ నుంచి అమలులోకి వచ్చినట్టు తెలిపారు. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, సెక్షన్‌ 5 కింద ఉన్న సంస్థ ఉపాధ్యాయులు, కాంటాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు, పెన్షనర్లకు చెల్లింపులు, కుటుంబ పింఛన్ల సొమ్మును సగానికి మించకుండా కొంతకాలానికి వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. మరో నోటిఫికేషన్‌ ద్వారా ఆరు నెలల్లోపు తిరిగి చెల్లించే వీలుంటుంది.

ఆర్డినెన్స్‌పై హైకోర్టుకు వివరించిన అడ్వకేట్‌ జనరల్‌ 

తెలంగాణ డిజాస్టర్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్‌ను అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు వివంరించారు. అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ ఆర్డినెన్స్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. వేతనాల్లో కోత విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్‌జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోమారు విచారణ చేపట్టింది. ఏ చట్టం ప్రకారం చెల్లింపులను వాయిదావేస్తున్నారని గత విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో.. తాజాగా జారీచేసిన ఆర్డినెన్స్‌పై అడ్వకేట్‌ జనరల్‌ వివరణ ఇచ్చారు. ఈ ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్లను సవరించి దాఖలు చేస్తామని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం విచారణను ఈనెల 24కు వాయిదావేసింది.


logo