శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 01:56:41

ఇగురంతో ఎవుసం

ఇగురంతో ఎవుసం

  • ఒకే పంట పెద్ద తంటా
  • అప్పుడే రైతుకు లాభం.. లేదంటే మొదటికే మోసం
  • ప్రభుత్వం చెప్పిన పంటలనే రైతులు సాగుచేయాలి 
  • వేయనివారికి రైతుబంధు, మద్దతు ధర బంద్‌
  • ముఖ్యమంత్రికి వ్యవసాయ నిపుణుల ప్రతిపాదన
  • దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ
  • జాతికి గొప్ప చేయూతనందిస్తున్న రాష్ట్రం
  • నియంత్రిత పద్ధతిలో సేద్యంచేస్తేనే సత్ఫలితాలు
  • వ్యవసాయ రంగ సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • అద్భుత వ్యవసాయక్షేత్రంగా తెలంగాణ రాష్ట్రం
  • సీఎం దార్శనికతను కొనియాడిన నిపుణులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఇప్పటికే దేశానికి ధాన్యాగారంగా మారిందని.. భవిష్యత్తులో మరింత అద్భుతంగా మారుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. వ్యవసాయాన్ని సుసంపన్నం చేయడంద్వారా భారతజాతికి తెలంగాణ గొప్ప చేయూతనందిస్తుందన్నారు. ప్రాజెక్టులు పూర్తిచేయడం, ఉచిత విద్యుత్తు ఇవ్వడం ద్వారా కొత్త ఆయకట్టు వచ్చిందని.. దానివల్ల అద్భుతమైన దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో దాదాపు 3.5 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. పది లక్షల టన్నుల మేర కంది పంట చేతికొచ్చే అవకాశం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలకోసం కోటి టన్నుల ధాన్యం సరిపోతుందని.. మరో 2.5 కోట్ల టన్నుల ధాన్యం మనం అమ్ముకోవాలంటే ఇందుకు సమగ్రమైన విధానం ఉండాలని సూచించారు. మిగులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే దానికి డిమాండ్‌ ఉండాలని.. మనం డిమాండ్‌ను సృష్టించాలని సూచించారు. 

ఇందుకోసం ప్రజల ఆహారపు అలవాట్లను మార్చాలన్నారు. లేదా డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలని చెప్పారు. ఇదంతా సాధించాలంటే పంటల సాగువిధానం.. ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సేద్యం చేయించడం.. దిగుబడికి మంచి ధరలు వచ్చేలా చేయడం లక్ష్యంగా సమగ్ర వ్యవసాయవిధానం రూపకల్పన జరుగాలని సీఎం కేసీఆర్‌ అన్నారు.  తెలంగాణలో వ్యవసాయ విధానం.. పంటల ఉత్పత్తి.. వినిమయం తదితర అంశాలపై ఆదివారం ప్రగతిభవన్‌లో దాదాపు ఎనిమిది గంటలపాటు సీఎం కేసీఆర్‌.. వ్యవసాయరంగ నిపుణులు, అధికారులతో సుదీర్ఘ సమీక్షాసమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయరంగంలో చేపట్టాల్సిన సంస్కరణలు.. మార్పులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తమ అభిప్రాయాలను తెలియజేశారు. గత ఆరేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌  వ్యవసాయం, రైతు సంక్షేమంకోసం తీసుకొన్న నిర్ణయాలు, చేపట్టిన చర్యల వల్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అద్భుత వ్యవసాయక్షేత్రంగా అవతరించిందని వ్యవసాయరంగ నిపుణులు కొనియాడారు. 

ఒకే పంటవేసి నష్టపోవద్దు

రైతులంతా మూస పద్ధతిలో ఒకే పంటవేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగుచేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని వ్యవసాయరంగ నిపుణులు, వ్యవసాయాధికారులు అభిప్రాయపడ్డారు. వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఫలితమివ్వాలంటే పంటలకు మంచిధర రావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ఎవరిష్టం వచ్చినట్లు వారు పంటల సాగు చేసుకోవడం కాకుండా వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పినట్లు పంటలు వేసే విధానం రావాలని స్పష్టంచేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంకోసం తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను మాత్రమే పండిస్తేనే పంటలకు మంచి ధర వస్తుందని చెప్పారు. ఏ రైతు ఏ పంట పండించాలనే విషయాన్ని ప్రభుత్వమే తేల్చాలని, దానికి అనుగుణంగా సాగు జరిగేట్లు చూడడం అత్యంత ప్రధానమన్నారు. 


మార్కెట్‌కు అనుగుణంగా సాగు

రాష్ట్రంలో ప్రజల ఆహారపు అలవాట్లు, మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాధికారులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయంలో కొంత నిర్ధారణకు వచ్చారు. ఏడాదిలో రెండు పంటలకు కలిపి వరి 80-90 లక్షల ఎకరాలు.. పత్తి 50 లక్షల ఎకరాలు.. కంది 10 లక్షల ఎకరాలు.. మక్కజొన్న 7 లక్షల ఎకరాలు.. వివిధ రకాల విత్తనోత్పత్తి 7 లక్షల ఎకరాలు.. మిర్చి రెండున్నర లక్షల ఎకరాలు.. కూరగాయలు మూడున్నర లక్షల ఎకరాలు.. వేరుశనగ రెండున్నర లక్షల ఎకరాలు.. పసుపు 1.25 లక్షల ఎకరాలు.. కొర్రలు, మినుములు, పెసర్లు, ఆవాలు, నువ్వులు లాంటి పంటలు మరో రెండు లక్షల ఎకరాలతోపాటు కొద్దిపాటి విస్తీర్ణంలో సోయాబీన్‌ పండించడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడటమే కాకుండా 30-40 ఏండ్ల పాటు నిరంతరంగా పంట దిగుబడి వచ్చే పామాయిల్‌సాగును తెలంగాణలో విస్తరించాలి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50 వేల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో పామాయిల్‌ పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువ ఉన్నందున తెలంగాణవ్యాప్తంగా 5 నుంచి 10 లక్షల ఎకరాల వరకు పామాయిల్‌ సాగు చేయొచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెప్పారు. 

వరిలో ఏ రకం ఎంత?

రాష్ట్రంలో 80-90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందులో కూడా మార్కెట్‌ అవసరాలకు తగ్గట్టు సన్న రకాలు ఎన్ని పండించాలి, దొడ్డు రకాలు ఎన్ని పండించాలనే విషయంలో కూడా స్పష్టత ఉండాలని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు లాంటి రాష్ర్టాలకు బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతిచేయాల్సి ఉంటుంది కాబట్టి, దొడ్డు రకాలు పండించాలని, తెలంగాణ ప్రజలు ఎక్కువగా సన్న రకాలు తింటారు కాబట్టి వాటినీ పండించాలన్నారు. బియ్యం గింజ పొడవు 6.2 మిల్లీమీటర్‌ అంతకన్నా ఎక్కువ ఉన్న రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది కాబట్టి ఆ రకాలనూ పండించాలని సూచించారు. ఏది ఎంత పండించాలనే విషయంలో నిర్ణయం తీసుకుని, అనుగుణంగా సాగుచేయాలని పేర్కొన్నారు. 

తెలంగాణ సోనాకు డిమాండ్‌

తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్‌ ఉన్నది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు షుగర్‌ ఫ్రీ రైస్‌గా వీటిని వ్యవసాయరంగ నిపుణులు గుర్తించారు. తెలంగాణ సోనా రకం బియ్యంలో ైగ్లెసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువశాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్‌ జర్నల్స్‌ కూడా ప్రచురించాయి. తెలంగాణ సోనాకు మంచి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్నది కాబట్టి ఈ రకాన్ని ఈ వానకాలం సీజన్‌లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలని, ఇందుకు కావాల్సిన విత్తనాలను వ్యవసాయ వర్సిటీ సిద్ధం చేసిందని నిపుణులు వెల్లడించారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత వేయాలో నిర్ణయించిన తర్వాత ఏ పంటను ఎక్కడ ఎంత విస్తీర్ణంలో పండించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వం చెప్పిన పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలని నిపుణులు సూచించారు. 

విత్తనాలపైనా నియంత్రణ

ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించిన విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలని నిపుణులు గట్టి సూచనచేశారు. విత్తన వ్యాపారులు తమకు తోచిన విత్తనాలను రైతులకు అంటగట్టే పద్ధతి పోవాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిస్థాయి నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వంచేసిన కృషి ఫలితంగా కరెంటు సమస్య తీరిందని, విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయని, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య తీరుతున్నదన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగటమే కాకుండా దిగుబడులు కూడా బాగా వస్తాయి. దిగుబడులకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయరంగాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌  చేసిన కృషికి సార్థకత లభిస్తుందని అన్నారు. అలా మంచి ధర రావాలంటే నియంత్రిత పద్ధతిలో సాగు జరగాలి. రాష్ట్రం, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనంచేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని వ్యవసాయ రంగ నిపుణులు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌ నిరంజన్‌రెడ్డి, రైతుబంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ ఎండీ సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీ కేశవులు, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌ సీమా, వ్యవసాయరంగ నిపుణులు రాధిక తదితరులు పాల్గొన్నారు.

నియంత్రిత పద్ధతి పాటించకుంటే రైతుబంధు ఇవ్వొద్దు

‘రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంటసాగుచేసే సంప్రదాయం చాలాకాలంగా ఉన్నది. అలాచేస్తే పండించిన పంటకు మంచిధర రాదు. మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి పంట పండించాలి. ఇలా పండించాలంటే నియంత్రిత పద్ధతి రావాలి. రైతులకు క్రమ పద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి. వ్యవసాయాధికారులు, వ్యవసాయ వర్సిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు అధ్యయనం, పరిశోధన ద్వారా ఎక్కడ ఏ పంట ఎంతమేర వేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి. ప్రభుత్వం సూచించిన పంటలు వేయని రైతులకు రైతుబంధు సాయాన్ని ఆపివేయాలి. వారు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు’ అని వ్యవసాయ నిపుణులు, అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు, కనీస మద్దతుధర ఇవ్వాలని కోరారు. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతున్నదని.. ప్రతి ఏటా ఇలాగే కొనడం సాధ్యం కాదని, ఎందుకంటే ప్రభుత్వం వ్యాపారసంస్థ కాదని గుర్తుచేశారు. పండించిన పంటకు మార్కెట్లో డిమాండ్‌ ఉంటేనే ధర వస్తుంది. లేకుంటే రాదు కాబట్టి మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు పండించడం తప్ప మరోమార్గం లేదని పేర్కొన్నారు.  


రానున్న రోజుల్లో తెలంగాణలో దాదాపు 3.5 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది.రాష్ట్ర ప్రజల అవసరాలకు కోటి టన్నుల ధాన్యం సరిపోతుంది.మరో 2.5 కోట్ల టన్నుల ధాన్యం అమ్ముకోవాలంటే సమగ్ర విధానం ఉండాలి. మిగులు ధాన్యాన్ని అమ్ముకోవాలంటే మనం డిమాండ్‌ను సృష్టించాలి. ఇందుకోసం ప్రజల ఆహారపు అలవాట్లను మార్చాలి.లేదా డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలి.

- సీఎం కేసీఆర్‌


logo