బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 04, 2020 , 22:25:15

బత్తాయి, మామిడికి మొబైల్‌ రైతుబజార్లు

బత్తాయి, మామిడికి మొబైల్‌ రైతుబజార్లు

హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లకు, నిత్యావసర వస్తువుల సరఫరాకు మండలం యూనిట్‌గా ప్రత్యేక వాహనాలను ఏర్పాటుచేస్తూ రవాణాశాఖ అనుమతులు జారీచేసింది. ఒక జిల్లా పరిధిలోని ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు.. వాటి పరిధిలో మండలాలు, గ్రామాలవారీగా వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ధాన్యం రవాణా కోసం డీసీఎం వ్యాన్లను వినియోగిస్తున్నారు. ధాన్యం దిగుబడులను అంచనా వేస్తూ ఒక్కో మండలంలో 10 వరకు వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు, రేషన్‌ సరుకుల కోసం కూడా రవాణాశాఖ ఆధ్వర్యంలో వాహనాలను కేటాయించారు. తెలంగాణ ఫుడ్స్‌ నుంచి వివిధ ప్రాంతాలకు సరుకులను చేరవేసేందుకు దాదాపు 50 నుంచి 100 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, బియ్యం, పప్పుతోపాటు ఆరోగ్యలక్ష్మి సరుకుల పంపిణీని కూడా దాదాపు పూర్తిచేశారు. రాష్ట్రంలోని గూడ్స్‌ సర్వీస్‌ సంస్థల వాహనాలు తిరిగేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. సరుకుల రవాణాకు ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో అధికారులతో కమిటీలను ఏర్పాటుచేశారు. మండలస్థాయిలో తాసిల్దార్ల ఆధ్వర్యంలో ఈ కమిటీలు ధాన్యం కొనుగోళ్లు, నిత్యవసరాల రవాణా కోసం ప్రణాళిక తయారుచేశారు. ఎంవీఐల పర్యవేక్షణలో వాహనాలను గ్రామాలవారీగా కేటాయించి పంపుతున్నారు.

3,500 ప్రాంతాల్లో పండ్ల మార్కెట్లు

మొబైల్‌ రైతుబజార్ల ద్వారా కూరగాయలు, పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు మార్కెటింగ్‌, ఉద్యానశాఖలు ప్రణాళికలు సిద్ధంచేశాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, పండ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్‌.. అధికారులను ఆదేశించారు. దీంతో నిత్యం హైదరాబాద్‌లో 3,500 ప్రాంతాల్లో మొబైల్‌ మార్కెట్ల ఏర్పాటుపై మార్కెటింగ్‌, ఉద్యానశాఖలు దృష్టి సారించాయి. రాష్ట్రంలోని 4.41 లక్షల ఎకరాల్లో మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్ల తోటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం బత్తాయి, మామిడి కోతకు వచ్చాయి. రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఈ పండ్లను జిల్లా కలెక్టర్లు, పోలీసుశాఖ సహకారంతో రైతుబజార్లు, మొబైల్‌ బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. 

పండ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్లు విస్తృత ప్రచారం కల్పించాలని ఉద్యానశాఖ సూచించింది. భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎమ్మార్‌) సిఫారసుల మేరకు ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 100 గ్రాముల పండ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాహార విలువలు సమపాళ్లలో అంది ఆరోగ్యంగా ఉంటారు. రాష్ట్రంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో బత్తాయి 70 వేల టన్నులు, నిమ్మ 1.22 లక్షల టన్నులు, మామిడి దాదాపు 6 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతాయి. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా వైరస్‌ల బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.


logo