సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 22:44:22

ప్రతిపక్షాలది బురద రాజకీయం : మంత్రి కేటీఆర్‌

ప్రతిపక్షాలది బురద రాజకీయం : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ : వరద బాధితుల సాయంపై  ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. క్లిష్ట సమయంలో బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచిందని ఆయన పేర్నొన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఒక్కరోజే లక్ష మందికి ఆర్థిక సాయం పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఇంటికే వచ్చి సాయం అందిస్తామని పేర్కొన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉంటే కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వరద బాధితులకు సాయం అందించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తే కనీస స్పందన రాలేదని అన్నారు.

కర్ణాటకలో వరద బాధితులను ఆదుకునేందుకు సాయం అందించిన ప్రధాని.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి కేంద్ర సహాయ మంత్రా? నిస్సహాయ మంత్రా చెప్పాలని డిమాండ్‌ చేశారు. వరదల కారణంగా నష్టపోయిన 4.30 లక్షలకుపైగా కుటుంబాలకు ప్రభుత్వ తరఫున సాయం అందించామని తెలిపారు. సాయం పొందిన ప్రతి బాధితుడి వివరాలు పక్కాగా ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

వరదల బాధితలకు సాయం అందించేందుకు 920 బృందాలను ఏర్పాటు చేసి ఆర్థిక సాయం పంపిణీ చేశాం. హైదరాబాద్‌ చరిత్రలో ఇంతటి భారీ వర్షం ఈ ఏడాదే నమోదైంది. చెరువులు, నాలాలను కబ్జా చేయడం వల్లే వందలాది కాలనీలు నీట మునిగాయి. మానవ తప్పిదాల వల్లే ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వం అప్రమత్తతో ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించగలిగాం. వైపరీత్యాలను ఎదుర్కొవడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా 800 మందితో డీఆర్‌ఎఫ్‌ టీంను ఏర్పాటు చేశాం. ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల గోడు విన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు పరిస్థితిని నివేదించడంతో బాధితులను ఆదుకునేందుకు తక్షణసాయం కింద రూ. 550 కోట్లు కేటాయించారని కేటీఆర్‌ తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.