బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:41

కుల రాజకీయాలు సాగవు

కుల రాజకీయాలు సాగవు

  • చిచ్చుపెట్టి చలికాచుకునే ఆలోచన సరికాదు
  • ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపాటు
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితుల పక్షపాతని వ్యాఖ్య
  • రాజకీయ ఉనికికే ఆరాటం: గువ్వల బాలరాజ్‌
  • కాంగ్రెస్‌, బీజేపీకి కడుపు మంట: ప్రభాకర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవాలనే ఆలోచనను కాంగ్రెస్‌ పార్టీ మానుకోవాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ హెచ్చరించారు. కుల రాజకీయాలు చేయడం తగదని, వారి ఆటలు సాగవని పేర్కొన్నారు. తెలంగాణలో కులాల కొట్లాటలకు, మత విద్వేషాలకు తావులేదని స్పష్టంచేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, ఎమ్మెస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి బాల్క సుమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల్లో దళితులపై అనేక ఘోరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలను తీసుకొని టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆపాదించే ప్రయత్నంచేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అద్భుతమైన పాలన సాగుతున్నదని, టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వం ఎప్పుడూ దళితుల పక్షపాతిగానే ఉంటుందని స్పష్టంచేశారు. 

శవాలపై పేలాలేరుకుంటున్న కాంగ్రెస్‌ 

కాంగ్రెస్‌ పార్టీ శవాలపై పేలాలు ఏరుకుంటున్నదని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు విమర్శించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ.. రాజకీయ ఉనికి కోసమే ఆరాటపడుతున్నదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు నర్సింలు రైతు వేదిక నిర్మాణ ప్రారంభంలోనూ పాల్గొన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ను పూర్తిగా బొంద పెట్టేవరకు ప్రజల్లోనే ఉంటామని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అంబులెన్స్‌లు ఏర్పాటులో నిమగ్నమై ఉంటే.. కాంగ్రెస్‌ రాజకీయాలు చేసే పనిలో ఉన్నదని విమర్శించారు. మండలిలో ప్రభుత్వ విప్‌ ఎమ్మెస్‌ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులు అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్‌, బీజేపీలకు కడుపులో మంటగా ఉన్నదని ఎద్దేవాచేశారు.logo