గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 14:57:32

సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు : మండలి చైర్మన్ గుత్తా

సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు :  మండలి చైర్మన్ గుత్తా

 నల్లగొండ : నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ సాధిస్తారని, ఆయన్ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ లపై కృష్ణా రివర్ బోర్డ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

బోర్డ్ కూడా ఏపీ ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని తప్పు పట్టి, నీటి నిలుపుదల చేయాలని ఆదేశించిందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు  కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు, అర్హత లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు  ద్వారా నీటిని తరలించుకుపోతుంటే  కనీసం నోరు కూడా  మెదపలేదన్నారు.

అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నానా రాద్ధాంతం చేస్తూ ముఖ్యమంత్రి పై అభాండాలు వేయడం  సరైంది  కాదని హితువు పలికారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితిల్లోనూ తెలంగాణ రైతుల  ప్రయోజనాలకు భంగం కలగనివ్వరని గుత్తా పేర్కొన్నారు. 

logo