గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 02:42:51

ఎంసెట్‌ ఫలితాల్లో అబ్బాయిల హవా

ఎంసెట్‌ ఫలితాల్లో అబ్బాయిల హవా

  • టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో వారే
  • తెలంగాణకు ఐదు, ఏపీకి ఐదు
  • మొత్తం 75.29 శాతం ఉత్తీర్ణత
  • విడుదల చేసిన మంత్రి సబిత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌) ఫలితాలలో టాప్‌టెన్‌లో బాలురే నిలిచారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం జేఎన్టీయూహెచ్‌ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఎంసెట్‌ ఫలితాలను విడుదలచేశారు. ఇందులో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలలో కలిపి మొత్తం 75.29 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు తెలిపారు. కరోనా బారినపడి ఎంసెట్‌కు హాజరుకాలేకపోయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ర్యాంకులు సాధించిన వారందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలను tseamcet.tsche.gov.in లో పొందుపరిచామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ పాల్గొన్నారు. ఎంసెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,43, 326 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, 1,19,183 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 80,728 (75.29 శాతం) మంది అర్హత సాధించారు. వీరిలో బాలురు 48,781 మంది, బాలికలు 31,947 మంది ఉన్నారు. 

చాలా సంతోషంగా ఉన్నది

ఎంసెట్‌లో మొదటి ర్యాం కు సాధించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. కష్టానికి ఫలి తం దక్కింది. లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌  నిర్వహించిన కోచింగ్‌ క్లాసులు నా కెంతో ఉపయోగపడ్డాయి.  నా ప్రిపరేషన్‌ కోసం మా అమ్మా, నాన్న ఎంతో శ్రమించారు. నాకు ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలలో 58వ ర్యాంకు వచ్చింది. ఐఐటీ ముంబై లో చేరుతాను. 

- సాయితేజ, ఫస్ట్‌ ర్యాంకర్‌ 

కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తా

ఎంసెట్‌లో స్టేట్‌ 5వ ర్యాం కు సాధించడం సంతోషంగా ఉన్నది. మా అమ్మ రాక్‌వెల్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె అందించిన స్ఫూర్తితో నేను  ర్యాంకు సాధించాను. ముంబైలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలని ఉన్నది. 

- హర్ధిక్‌ రాజ్‌పాల్‌ 

వెబ్‌సైట్‌లో 2019 ఎంసెట్‌ లాస్ట్‌ ర్యాంకు వివరాలు 

ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం గత ఏడాది ఏ ర్యాం కువారికి, ఏ కాలేజీలో సీటు వచ్చింది అన్న వివరాలు టీఎస్‌ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌చేశారు. ఆ వివరాలు తెలిసుకొని, ప్రస్తుతం ప్రారంభంకానున్న కౌన్సెలింగ్‌లో వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకోవడానికి వీలుంటుంది. పూర్తి వివరాలకు https://tseamcet.nic.inను సంప్రదించాలని అధికారులు సూచించారు. కౌన్సెలింగ్‌కు హాజరుకానున్నవారికి కావాల్సిన సహాయ కేంద్రాల జాబితాలు కూడా వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని, ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను చూస్తూ అప్‌డేట్‌ కావాలని తెలిపారు.


logo