బుధవారం 27 మే 2020
Telangana - May 18, 2020 , 01:07:50

గురుకులాల్లో ఆన్‌లైన్‌ బోధన

గురుకులాల్లో ఆన్‌లైన్‌ బోధన

 హైదరాబాద్:  కరోనా కట్టడిలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఇంటికే పరిమితమైన విద్యార్థుల కోసం గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆన్‌లైన్‌ తరగతులకు శ్రీకారం చుట్టారు. స్మార్ట్‌ఫోన్‌ ద్వారా తరగతుల ను సద్వినియోగం చేసుకునేందుకు ‘ఓక్స్‌' యాప్‌ను రూ పొందించారు. స్మార్ట్‌ఫోన్లు లేని వారికి ‘టీ-శాట్‌' ద్వారా టీవీలో పాఠాలు బోధిస్తున్నారు. నెల రోజులుగా వరంగల్‌ రీజియన్‌లోని 19 సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే వాట్సప్‌ గ్రూపుల్లో విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.   

సెక్షన్‌కు 40 మంది విద్యార్థులు..

విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓక్స్‌ యాప్‌ను రూపొందించారు. ఇందుకోసం సెక్షన్‌కు 40 మంది విద్యార్థుల చొ ప్పున గ్రూపులు ఏర్పాటు చేసి, ఆయా సెక్షన్‌ విద్యార్థులకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కేటాయించారు. విద్యార్థులతో స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. ఈ యాప్‌ ద్వారా ఆయా సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలను వీ క్షిస్తారు. ఆయా అంశాలపై యాప్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారు.  అంతేకాకుండా విద్యార్థులు రాసిన సమాధానాలకు మూల్యాంకనం చేసి మార్కులు సైతం ఇస్తారు.  

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో..

 ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉండకపోవచ్చు. దీనికోసం శాటిలైట్‌ చానల్‌ ‘టీ-శాట్‌' ద్వారా ‘జ్ఞాన దీక్ష’ పేరుతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కామన్‌ సిలబస్‌ రూపొందించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు అంశాలు (సబ్జెక్టులు) బోధిస్తున్నారు. తద్వారా విద్యార్థులకు అదనపు జ్ఞానం లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు అందుబాటులో లేని విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫోన్‌ చేసి మరీ చదువుకోవాలని ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు. టీ-శాట్‌లో బోధించడానికి వరంగల్‌ రీజియన్‌ నుంచి టీజీటీ రామ్‌తేజ(వర్ధన్నపేట), పీజీటీ రాజవీర శంకర్‌(పరకాల) ఎంపికయ్యారు.  

సాంకేతికతతో విద్యాబోధన 

లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులకు నష్టం కలుగకుండా ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించారు. సాంకేతికత సాయంతో విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం. విద్యార్థులు సైతం సహకరిస్తున్నారు. విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు గురుకులాల సంస్థ తరఫున కృతజ్ఞతలు.

- ఉమామహేశ్వరి, వరంగల్‌ రీజియన్‌ కోఆర్డినేటర్‌ 


logo