ఆదివారం 24 జనవరి 2021
Telangana - Oct 20, 2020 , 01:30:12

ఆన్‌లైన్‌ షాపింగ్‌.. జర జాగ్రత్త

ఆన్‌లైన్‌ షాపింగ్‌..  జర జాగ్రత్త

ఆఫర్ల వలలో చిక్కితే అప్పులపాలే

సైబర్‌ నేరగాళ్లకు దొరికితే దోపిడీలే

నకిలీ తెల్వకుంటే నట్టేట మనిగినట్టే

పండుగ సీజన్‌ వచ్చేసింది.. కొత్త బట్టలు కొనుక్కోవాలని, బోనస్‌లు పడితే ఇంట్లోకి కొత్త వస్తువు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఈ కరోనా టైంలో బయటికి వెళ్లి షాపింగ్‌ చేస్తే వైరస్‌ రూపంలో కొత్త బోనస్‌ వచ్చే ప్రమాదం ఉంది. అదేదో ఆన్‌లైన్‌లో కొనేద్దాం.. ఆఫర్లు కూడా ఉంటాయని అనుకుంటాం. ఆ ఆఫర్లకు ఆశపడి, ఏ వెబ్‌సైట్‌ పడితే అది క్లిక్‌ చేశారో మీ బ్యాంక్‌ ఖాతా ఖాళీ అవుద్ది. నిజమేంటో, నకిలీ ఏంటో తెలియకుంటే నట్టేట మునిగిపోతారు.

హైదరాబాద్‌ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: దసరా పండుగ పూట ఈ-కామర్స్‌ సంస్థలు ఊహించని డిస్కౌంట్లు, ఆశ్చర్యపోయే ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వేలకు వేలు డిస్కౌంట్లు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. దొరికిందే సందు అనుకొని సైబర్‌ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, కండ్లు బయర్లుకమ్మే ఆఫర్లను ప్రకటించి, అమాయకులను నిలువునా దోచుకొంటున్నారు. మీరు ఆన్‌లైన్‌లో కొన్నవాటికి లాటరీ తగిలిందని, కారు బహుమతిగా వచ్చిందని.. కారు వద్దంటే నగదు ఇస్తామంటూ నమ్మిస్తూ నిండా ముంచేస్తున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవాళ్ల డాటా చోరీ చేసి కేవైసీ అప్‌డేట్‌ పేరుతో బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకొని దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలాంటప్పుడే అప్రమత్తంగా ఉండాలి. పండుగ పూట నకిలీ ఆఫర్లకు లొంగిపోయి దోపిడీకి గురికావొద్దు. ఆఫర్లు పోతే మళ్లీ రావని, డబ్బు మిగులుతుందని అత్యాశకు పోతే ఉన్నదంతా ఊడ్చేసుకుపోయే ప్రమాదం ఉంది. ఆఫర్ల లింక్‌ను క్లిక్‌ చేసేముందే ఖరీదైన, బ్రాండెడ్‌ వస్తువులను ఎందుకు తక్కువ ధరకు ఇస్తున్నారు? అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి.

ఏవి మోసపూరిత ఆఫర్లు..

వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఇతర సోషల్‌ మీడియా వేదికలపై మొదటి వెయ్యి మందికి భారీ ఆఫర్లు అంటూ ఓ లింక్‌ను తయారు చేసి వల విసురుతారు. దీనికి బ్రాండెడ్‌ కంపెనీల పేర్లు వాడుకుంటారు. మీరు మొదట కొనుగోలు చేస్తే రూ.2.50 లక్షల వాచీ కేవలం 2,500కే వస్తుందని ప్రకటనను సృష్టించి పంపుతారు. వాటిని చూసి, ఆశపడి క్లిక్‌ చేస్తే ఆ లింక్‌లోని వైరస్‌ మీ స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌లోకి దూసుకుపోయి మీ రహస్య ఆర్థిక లావాదేవీలు, ఇతర ప్రైవేటు అంశాలను సైబర్‌ మోసగాళ్లకు చేరవేస్తుంది. బ్యాంకు లావాదేవీలు జరిపితే వివరాలు వారికి చేరిపోతాయి.

నిజం-నకిలీ తెలుసుకోవాలి

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ వంటి ఈ కామర్స్‌ సంస్థలకు నకిలీవి సృష్టించి కొందరు సైబర్‌ దోపిడీకి పాల్పడుతున్నారు. అందువల్ల ఫేక్‌ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అసలు వెబ్‌సైట్‌ వివరాలు తెలుసుకున్నాకే లాగిన్‌ కావాలి. సైబర్‌ మోసగాళ్లు అక్షరం తేడాతో బ్రాండెడ్‌ కంపెనీ పేర్లను కాపీ కొడతారు కాబట్టి వాటిని క్షుణ్నంగా తనిఖీ చేసుకోవాలి. అనుమానం వస్తే వాటి జోలికి పోవద్దు. 

నేరుగా షాపింగ్‌ చేయటమే శ్రేయస్కరం

ఆన్‌లైన్‌ షాపింగ్‌ కన్నా నేరుగా దుకాణానికి వెళ్లి కుటుంబసమేతంగా కొనుగోలు చేయటమే ఉత్తమం. ఆన్‌లైన్‌ షాపింగ్‌పై పరిజ్ఞానం లేకుంటే వాటి జోలికి వెళ్లవద్దు. సంస్థ తీసిన లాటరీలో భారీ బహుమతి గెల్చుకున్నారని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తే అది కచ్చితంగా మోసమే. పండుగను సంతోషంగా జరుపుకోండి, ఆర్థికంగా మోసపోయి బాధపడకండి. తెలివి తేటలతో సైబర్‌ నేరగాళ్ల ఎత్తులను చిత్తు చేయండి.

-హరినాథ్‌, ఏసీపీ, రాచకొండ సైబర్‌ క్రైం పోలీస్‌స్టేషన్‌


logo