శుక్రవారం 03 జూలై 2020
Telangana - Mar 31, 2020 , 02:44:24

లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ సేవలు

లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌ సేవలు

  • రోగుల కష్టాలు తీర్చనున్న  ప్రైవేటు దవాఖానలు
  • వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యుల కన్సల్టేషన్‌
  • అత్యవసరమైతే వైద్యశాలకు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19తో యావత్‌ దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయింది. దీంతో నిత్యావసర, అత్యవసర వ్యవస్థలు సైతం దాదాపుగా స్తంభించాయి. అయితే వైద్యం మాత్రం నిరంతరం అవసరమయ్యే అత్యవసర సర్వీసు. కానీ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇంటి గడప దాటే పరిస్థితి లేదు. ముందు జాగ్రత చర్యగా అన్ని దవాఖానలు ఓపీ సేవలను సైతం రద్దు చేశాయి. దీని వల్ల బీపీ, షుగర్‌, డయాలసిస్‌, గుండె, కాలెయ, క్యాన్సర్‌ వ్యాధులతో బాధపడే రోగులకు ఏ సమయంలో వైద్యుని అవసరం పడుతుందో చెప్పలేం. మరికొంత మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం. నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమయ్యే ప్రమాదముంటుంది. కానీ ప్రస్తుతం కర్ఫ్యూ నేపథ్యంలో అటు దవాఖానల్లో ఓపీ లేక, ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితిలేక ఎంతోమంది రోగులు సతమతమవుతున్నారు.. కరోనాతో మరికొంత మంది దవాఖానకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అలాం టి భయాలు, అడ్డంకులున్న వారందరికీ నగరంలోని పలు ప్రైవేటు దవాఖానలు ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ సేవలు గతంలో కూడా ఉన్నప్పటికీ అప్పుడు కేవలం కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు అన్ని వర్గాలవారికి ఈ సేవలే ఆవశక్యంగా మారాయి. నగరంలోని ప్రముఖ కార్పొరేట్‌ హాస్పిటల్స్‌తోపాటు క్లినిక్స్‌ ఆన్‌లైన్‌ వైద్యసేవలను అందిస్తున్నాయి. ఫోన్‌తోపాటు వీడియో కాల్స్‌లో వైద్యసేవలు అందిస్తున్న ప్రైవేటు దవాఖానల వివరాలను తెలుసుకుందాం.

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ దవాఖానలో... 

పిల్లలు, ప్రసూతి సేవల కోసం గర్భిణులు 1800-2122 నంబర్‌కు కాల్‌ చేసి వైద్యుల అపాయింట్‌మెంట్‌ పొందవచ్చు. లేదా https//bit.ly/3ag JNwWకు వీడియోకాల్‌ చేసి వైద్యులను సంప్రదించవచ్చు. దవాఖానకు వెళ్లకుండానే ఇంట్లో నుంచే వీడియోకాల్‌లో నేరుగా వైద్యులతో మాట్లాడుతూ తమ సమస్యలను తెలపవచ్చు. ఆన్‌లైన్‌లోనే వైద్యులు మెడికల్‌ ప్రిస్కిప్షన్‌, టెస్ట్‌లు రాయడం జరుగుతుంది. 

కిమ్స్‌ దవాఖానలో..

వైద్యులను సంప్రదించాలంటే 040-44885000 నంబర్‌కు కాల్‌ చేయాలి.  ఈ నెంబర్‌కు కాల్‌ చేస్తే వెంటనే మన ఫోన్‌కు ఒక లింక్‌ వస్తుంది. సదరు లింక్‌పై క్లిక్‌ చేస్తే కిమ్స్‌ దవాఖానకు చెందిన వెబ్‌సైట్‌కు నేరుగా లాగిన్‌ అవుతుంది.. ఈ క్రమంలో మనకు అవసరమైన వైద్యుని అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆన్‌లైన్‌లోనే వైద్యున్ని సంప్రదించవచ్చు.

సన్‌షైన్‌లో ఉచిత ఆన్‌లైన్‌ సేవలు

సన్‌షైన్‌ దవాఖాన రోగుల కోసం ‘ఎంఫిన్‌' అనే ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగులు ఎంఫిన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-44550000కు కాల్‌చేసి రోగి వివరాలను చెప్పాలి. వెంటనే ఈ హెల్ప్‌లైన్‌ నుంచి ఓపీ విభాగానికి సంబంధించిన లింక్‌ వస్తుంది. ఈ లింక్‌తో అవసరమైన వైద్యుడితో నేరుగా వీడియోకాల్‌లో మాట్లాడవచ్చు. అక్కడ రోగిని పరిశీలించి మందుల ప్రిస్కిప్షన్‌ సూచిస్తారు. అవసరమైతే వైద్యపరీక్షలకు సిఫారసు చేసి వాటి నివేదికల ఆధారంగా తదుపరి చికిత్స అందిస్తారు. వైద్యుడి కన్సల్టేషన్‌ పూర్తి ఉచితం. 

యశోద దవాఖానలో..

యశోద దవాఖాన వైద్యుల అపాయింట్‌మెంట్‌ కావాలనుకునేవారు https//www.yashodahospita ls.com అనే లింక్‌తో అవసరమైన డాక్టర్లను ఆన్‌లైన్‌లోనే సంప్రదించవచ్చు. ఇంటర్నెట్‌ సౌకర్యం లేనివారు 040-45674567 నంబర్‌కు ఫోన్‌చేసి నిర్ణీత సమయానికి వైద్యులను సంప్రదించవచ్చు. ఆన్‌లైన్‌ ఓపీ సేవలకు సంబంధించి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారు. 

అపోలో దవాఖానలో..

ఆన్‌లైన్‌ సేవల కోసం అపోలో దవాఖాన https// www.apollo247.com వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాగిన్‌ అయ్యి అవసరమైన వైద్యుడి అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. నిర్ణీత సమయానికి ఆన్‌లైన్‌లో వైద్యుడిని సంప్రదించవచ్చు. 24గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. 


logo