గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:57:00

యాప్‌లోకి 13.14 లక్షల ఇండ్లు

యాప్‌లోకి 13.14 లక్షల ఇండ్లు

  • గ్రామాల్లో 63 లక్షలకుపైగా గృహాలు
  • యాప్‌లోకి రోజుకు సగటున 2 లక్షలు 
  • వేగంగా కొనసాగుతున్న ఆన్‌లైన్‌ ప్రక్రియ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల వివరాల ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షలకుపైగా ఇండ్లు రికార్డుల్లోకి ఎక్కాయి. వీటన్నింటినీ టీఎస్‌ ఎన్‌పీబీ యాప్‌లోకి ఎక్కించి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. మొదట ఈ-పంచాయతీ పోర్టల్‌లోకి ఎక్కించి.. ఆ తర్వాత యాప్‌లో ఫొటోలు, ఇతర వివరాలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల గృహాలు పోర్టల్‌లో నమోదవగా, గురువారం నాటికి 13.14 లక్షల ఇండ్లను యాప్‌లో ఆన్‌లైన్‌ చేశారు. ఈ నెల మూడో తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌లో రోజుకు సగటున 2 లక్షలకు పైగా ఇండ్లను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శికి రోజుకు 50 ఇండ్లు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించగా.. ఒక్కొక్కరు సగటున 30 నుంచి 35 ఇండ్ల వివరాలు సేకరిస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు. మొన్నటి వరకు యాప్‌లో సాంకేతిక సమస్యలు, కొన్ని అంశాల్లో స్పష్టత లేక ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటిని పరిష్కరించి, ఒక్కో కార్యదర్శి రోజుకు 50 నుంచి 70 ఇండ్లను ఆన్‌లైన్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. 

ఖమ్మం టాప్‌.. మేడ్చల్‌ లాస్ట్‌ 

ఇండ్లను ఆన్‌లైన్‌ చేయడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 90,695 ఇండ్ల వివరాలను యాప్‌లో నమోదుచేశారు. నల్లగొండ జిల్లాలో 86,022, భద్రాద్రి కొత్తగూడెం 69,050, రంగారెడ్డి 64,612, మెదక్‌ 58,094తో టాప్‌-5లో ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 10,996తో చివరిస్థానంలో నిలువగా, వరంగల్‌ అర్బన్‌ 13,001, ఆదిలాబాద్‌ 18,781, ములుగు 20,160, నారాయణపేట 24,810 సూర్యాపేట 27,214తో వెనుబడి ఉన్నాయి. మిగిలిన జిల్లాలు 31వేల పైచిలుకు ఇండ్లను ఆన్‌లైన్‌ చేశాయి.


logo