శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 01, 2020 , 00:10:11

నేటి నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు

నేటి నుంచే ఆన్‌లైన్‌ పాఠాలు

  • ఉదయం 7.45 గంటలకు దూరదర్శన్‌లో ప్రారంభించనున్న మంత్రి సబిత
  • పూర్తిగా సహకరిస్తామన్న టీచర్‌ యూనియన్లు

కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలలు ఆలస్యంగా బడులు తెరుచుకోనున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో! విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం నుంచి దూరదర్శన్‌లో డిజిటల్‌ తరగతులు ప్రారంభమవుతాయి. నిర్ణీత సమయంలో పాఠ్యాంశం మిస్‌ అయిన వారికోసం టీసాట్‌, యూట్యూబ్‌ ద్వారా కూడా అందుబాటులో ఉంచుతున్నారు.  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ క్లాసులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఉదయం 7.45 గంటలకు రామంతపూర్‌లోని దూరదర్శన్‌ కేంద్రం లో డిజిటల్‌ బోధన ప్రసారాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌లో బోధనను అందుబాటులోకి తెచ్చేందుకు ఆగస్టు 27 నుంచి టీచర్లు విధులకు హాజరవుతున్నారు. టీవీలు  ఉన్న, టీవీలు లేని విద్యార్థులను విభజించారు. టీవీ లు లేని విద్యార్థుల కోసం స్కూల్‌ పాయిం ట్స్‌, గ్రామాలవారీగా ప్రత్యామ్నాయ మార్గా లు చూపించారు. రాష్ట్రంలో దాదాపు 92% మంది ఇండ్లలో టీవీలు ఉన్నాయని విద్యాశా ఖ సర్వేలో తేలింది. టీవీలు లేని 8% మందికి పాఠాలు బోధించేందుకు ప్రత్యామ్నాయ వేదికలను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌ పాఠాలపై విద్యాశాఖ విస్తృతంగా ప్రచారం చేసింది. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తెలియపరుస్తున్నారు. డిజిటల్‌ పాఠాలు బోధించాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టంచేశాయి. 

గిరిజన విద్యాసంస్థల్లో డిజిటల్‌ తరగతులు: మంత్రి సత్యవతి

కరోనా వ్యాప్తి నేపథ్యంలో గిరిజన విద్యాసంస్థల్లో డిజిటల్‌ విధానంలో బోధన చేపడుతున్నామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. గిరిజనశాఖ అధికారులతో సోమవారం తన నివాసంలో మంత్రి సమావేశమయ్యారు. శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు, గిరిజనస్కూళ్ల పరిధిలో ఆటంకం లేకుండా డిజిటల్‌ తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు ఉన్నవారు, దూరదర్శన్‌ ద్వారా డిజిటల్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థులను వేరు వేరు గ్రూపులుగా నిర్ణయించాలన్నారు. విద్యుత్‌, టెలికం విభాగాలతో సంప్రదిస్తూ తరగతులకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. 

టీసాట్‌లో రోజుకు 12, డీడీలో 6 క్లాసులు

మూడు నుంచి 10వ తరగతి విద్యార్థులకు టీవీల్లో ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌ విడుదలైంది. మంగళవారం నుంచి 14వ తేదీ వరకు శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజు లు తరగతులవారీగా నిర్దేశిత సమయంలో పాఠాలు ప్రసారం కానున్నాయి. టీసాట్‌ (విద్య చానల్‌)లో తొలి రోజు 10 కాస్లులు, మిగిలిన రోజులు 12 క్లాసులు నడవనున్నాయి. డీడీ యాదగిరిలో ప్రతి రోజు 6 క్లాసులు నిర్వహించనున్నారు. టీ సాట్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు, డీడీ యాదగిరి చానల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు తరగతులవారీగా కేటాయించిన సమయాల్లో పాఠాలు ప్రసారం చేస్తారు.

గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

డిజిటల్‌ పాఠాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దృష్టిపెట్టాం.ఇప్పటికే డీఈవోలకు, ఆర్జేడీలకు ఆదేశాలిచ్చాం.

- విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన

ప్రసారాలకు అంతా సిద్ధం

డిజిటల్‌ పాఠాల ప్రసారానికి టీసాట్‌ ద్వారా ఏర్పాట్లు చేశాం. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖకు చెం దిన పాఠాల  ప్రసారాలు తొలి రోజు 10 గంటల నుంచి, రెండో రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి ఉంటాయి. 

- టీసాట్‌ సీఈవో ఆర్‌ శైలేశ్‌రెడ్డి


logo